పథకం కొట్టే భారత అథ్లెట్ల పై కాసుల వర్షం !

Update: 2021-07-21 14:30 GMT
ఒలంపిక్ పథకం పట్టిన భారత్ అథ్లెట్లపై కోట్ల వర్షం కురవనుంది. ప్రపంచంలోని ధనిక దేశాలు కూడా ప్రకటించని భారీ నజరానాలను.. మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి అవాక్కయ్యేలా చేశాయి. మెగా ఈవెంట్‌ లో మెడల్‌ సాధించిన అథ్లెట్లకు రూ. 25 లక్షల నుంచి రూ. 6 కోట్ల వరకు ముట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం స్వర్ణం గెలిచిన ప్లేయర్‌ కు రూ. 2 కోట్లు ఇవ్వనుండగా, ఆంధ్రప్రదేశ్‌ రూ. 75 లక్షల ప్రైజ్‌మనీ తో సత్కరించనుంది. పసిడి పట్టిన ప్లేయర్‌ కు హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు అత్యధికంగా ఆరు కోట్ల రూపాయలు ప్రకటించాయి. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు. స్వర్ణానికి రూ. 75 లక్షలు, రజతానికి రూ. 50 లక్షలు, కాంస్యానికి రూ. 25 లక్షలు అదనం. 2016 రియో ఒలింపిక్స్‌ లో భారత్‌ కు రెండే  పతకాలు లభించాయి.

బ్యాడ్మింటన్‌ లో పీవీ సింధు రజతం సాధించగా, రెజ్లింగ్‌ లో సాక్షి మాలిక్‌ కాంస్యం నెగ్గింది. మరి ఈసారి ఎన్ని పతకాలు దక్కుతాయో చూడాలి. ఒలింపిక్స్‌ ను వాయిదా వేయడంతో , ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం, చీఫ్‌ థామస్‌ బాచ్‌  చెప్పాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో నెలకొన్న అనిశ్చితి వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందని తెలిపాడు. ఆరంభ సమయం దగ్గరపడినా ఆందోళన మాత్రం తగ్గలేదన్నాడు. విశ్వ క్రీడల ఆరంభోత్సవంలో ప్రతిజ్ఞ చేయించే అథ్లెట్ల సంఖ్యను మూడు  నుంచి ఆరుకు పెంచారు. లింగ సమానత్వాన్ని కూడా పాటించనున్నారు. మెగా ఈవెంట్‌ లో పాల్గొనే క్రీడాకారుల తరఫున ఇద్దరు ఆతిథ్య అథ్లెట్లు ప్రతిజ్ఞ చేయనున్నారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. కాగా, టోక్యో క్రీడల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తోషిరో మూటో తాజాగా మరో బాంబు పేల్చాడు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందని చెప్పాడు. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారితే.. చివరి నిమిషంలోనైనా ఒలింపిక్స్‌ను రద్దు చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నాడు.

ఇక, గోల్డ్ మెడల్ 556 గ్రాముల బరువు ఉంటుంది. సిల్వర్ మెడల్ 550 గ్రాములుంటే.. బ్రాంజ్ 450 గ్రామల బరువు ఉంటుంది. ప్రస్తుతం మన భారత్ లో ఉన్న బంగారం రేటు ప్రకారం గోల్డ్ మెడల్ దక్కించుకున్న అథ్లెట్ కు 26 లక్షల వరకు దక్కునున్నాయి. 556 గ్రాముల బంగారానికి కేవలం అంతేనా దక్కేది అనుకుంటున్నారా, అయితే, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. గోల్డ్, సిల్వర్ మెడల్‌లో 550 గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించారు. కాకపోతే స్వర్ణ పతకం వెండితో రూపొందించి పైన 6 గ్రాముల బంగారు పూతను పూశారు. దీంతో గోల్డ్ మెడల్ వాల్యూ కేవలం 65 వేల 790 రూపాయల మాత్రమే. ఇక వెండి పతకం 550 గ్రాముల బరువు ఉంటుంది. దీని విలువ రూ. 34,500 వరకు ఉండవచ్చు. అయితే ఇది కేవలం మార్కెట్ రేటు మాత్రమే..

స్వర్ణ విజేతలకు రాష్ట్రాల నజరానా :

రూ. 6 కోట్లు: యూపీ, హరియాణా, ఒడిశా

రూ. 5 కోట్లు కర్ణాటక, గుజరాత్‌

3 కోట్లు: ఢిల్లీ, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు

రూ. 2.25 కోట్లు: పంజాబ్‌

 రూ. 2 కోట్లు:తెలంగాణ హిమాచల్‌, జార్ఖండ్‌

రూ. 1.5 కోట్లు ఉత్తరాఖండ్‌

రూ. 1.2 కోట్లు మణిపూర్‌

రూ. కోటి మహారాష్ట్ర, కేరళ, గోవా

రూ. 75 లక్షలు ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ

రూ. 50 లక్షలు జమ్మూకశ్మీర్‌

రూ. 25 లక్షలు పశ్చిమ బెంగాల్‌

పసిడి విజేతలకు ఇతర దేశాల ప్రైజ్‌మనీ :

కెనడా : రూ. 15 లక్షలు

జర్మనీ : రూ 18.73 లక్షలు

అమెరికా : రూ. 28 లక్షలు

రష్యా : రూ. 46 లక్షలు

ఇటలీ : రూ. 1.25 కోట్లు

కజకిస్థాన్‌ : రూ. 1.87 కోట్లు.
Tags:    

Similar News