ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక ఏం జ‌రుగుతుంది?

Update: 2018-12-10 05:04 GMT
ఎన్నిక‌ల ఫలితాల మీద ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటున్న వైనం తెలిసిందే. తుది ఫ‌లితాలు త‌మ‌కే అనుకూలంగా ఉంటుంద‌న్న ధీమాను ఎవ‌రికి వారు వ్య‌క్తం చేస్తున్నారు. ఆయా పార్టీలు ఊహించిన విధంగా స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌స్తే ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అందుకు భిన్నంగా ఫ‌లితాలు వ‌స్తేనే రాజ‌కీయం మ‌రింత రంజుగా మార‌టం ఖాయం.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత నుంచి కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు వ‌ర‌కు అస‌లేం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సాంకేతికంగా చూస్తే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నానానికి వ‌చ్చేయ‌నున్నాయి. ఉద‌యం 9గంట‌ల‌కు ట్రెండ్ ఏమిట‌న్న‌ది అర్థ‌మైపోతుంది. ప‌ది గంట‌ల నాటికి తుది ఫ‌లితం ఏమిటో క‌న్ఫ‌ర్మ్ కానుంది. నియోజ‌క‌వ‌ర్గాల వారీ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక‌.. గెలిచిన అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల సంఘం ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్ని అధికారికంగా జారీ చేస్తారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థులకు స్థానిక రిట‌ర్నింగ్ అధికారులు ఎన్నిక‌ల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్ని అంద‌జేస్తారు.

అదే స‌మ‌యంలో గెలిచిన అభ్య‌ర్థుల‌తో గెజిట్ నోటిఫికేష‌న్ జారీ అవుతుంది. గెజిట్ నోటిఫికేష‌న్ జారీ అయిన వెంట‌నే కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధ‌మైన‌ట్లే. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి.. ఏ రాజ‌కీయ పార్టీ అయినా మేజిక్ ఫిగ‌ర్ ను అధిగ‌మిస్తే.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేన‌ట్లే. ఒక‌వేళ అందుకు భిన్నంగా కూట‌మి మొత్తానికి క‌లిపి మేజిక్ ఫిగ‌ర్ వ‌స్తే మాత్రం.. గ‌వ‌ర్న‌ర్ కూట‌మిని గుర్తించి.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ప‌ల‌కాల్సి ఉంటుంది. అలా కాకుండా కూట‌మితో స‌హా ఎవ‌రికి ప్ర‌భుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసే సీట్లు రాకుంటే మాత్రం.. అత్య‌ధిక సీట్లు సాధించిన పార్టీకి గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం ప‌ల‌కాల్సి ఉంటుంది. అత్య‌ధిక సీట్లు సాధించిన పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి సానుకూల‌త వ్య‌క్తం చేస్తే.. వారు త‌మ బ‌లాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.  తాజాగా ముగిసిన ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. హంగ్ ఏర్ప‌డ‌టానికి అవ‌కాశాలు బాగా త‌క్కువ అన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News