కోదండ‌రాం కులం అడిగిన పోలీసులు

Update: 2017-10-15 08:33 GMT
తెలంగాణ జేఏసీ ఆధ్వ‌ర్యంలో తాను త‌ల‌పెట్టిన అమ‌రుల స్పూర్తి యాత్ర ఆరవ విడ‌త‌ను ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డంపై  చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం  తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం భయపడటం వల్లే ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని ఉద్య‌మ‌కారుల‌ను అణిచివేస్తున్న ప‌రిస్థితులు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. తార్నాకలోని త‌న నివాసంలో ఏర్పాటుచేసిన‌ మీడియా సమావేశంలో ఆచార్య కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డ్డారు. 6వ విడత అమరుల స్ఫూర్తి యాత్రకు పోలీసు అనుమతి కోరగా.... మౌఖిక ఆదేశాలు ఇచ్చి...యాత్ర మొదలైన తర్వాత అనుమతి తీసుకొచ్చేందుకు వెళ్లాల్సిన వ్యక్తిని గృహనిర్భంధం చేశారని ఆక్షేపించారు. యాత్రపై ఆఖరు నిమిషంలో పోలీసులు మనసు మార్చుకున్నారని పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచే ఐకాస నేతల అరెస్టులు ప్రారంభించి...వరంగల్ 300, హైదరాబాద్ లో 110 మందిని, మొత్తం 400 మందిని అరెస్టు చేశారని కోదండ‌రాం మండిప‌డ్డారు.

అరెస్టు చేసిన తర్వాత పోలీసు స్టేషన్ లో పుట్టుమచ్చలతోపాటు కులం పేరు అడిగారని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండ‌రాం తెలిపారు. కులం అడిగే సంప్రదాయం అనాగరికమైనదని...ఇది ఇప్ప‌టికైనా మారాలని కోరారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు తమను గుర్తుపట్టడానికి అనుకూలమైన రీతిలో యూనిఫాం ధరించాల్సి ఉండ‌గా....ఆ నిబంధనలు పాటించకుండా... సివిల్ దుస్తుల్లో వచ్చారని ఇది సరికాదని తెలిపారు.

సెక్షన్ 151 కింద అరెస్టు చేయడం అన్యాయమ‌ని మండిప‌డ్డారు. మానభంగాలు, దొమ్మీలు వంటి కాగ్నిజబుల్ నేరం జరిగే అవకాశం ఉందనుకున్నప్పుడే వేరే ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే సెక్షన్ 151 వర్తిస్తుందని తెలిపారు. కానీ మా కార్యక్రమం గురించి ప్రభుత్వానికి , పోలీసులకు ముందే వెల్లడించిన‌ప్ప‌టికీ ఈ సెక్ష‌న్ల ఆధారంగా అరెస్టు చేశార‌ని కోదండ‌రాం మండిప‌డ్డారు.

తెలంగాణ ప్రభుత్వం బలహీనపడుతోందిని....మమ్మల్నిచూసి భయపడుతోందని కోదండ‌రాం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే త‌మ‌ను అరెస్టు చేశారని ఈ సంఘటనలతో త‌మ సంకల్పం మరింత బలపడిందని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు ఈ అరెస్టు పరిణామాలు వివరిస్తామ‌ని... గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామ‌ని... కోర్టుకు కూడా వెళ్తామ‌ని కోదండ‌రాం తెలిపారు. ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. నల్గొండలో 21, 22 లో 7వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తామ‌ని కోదండ‌రాం ప్ర‌క‌టించారు. ఈ యాత్ర కోసం ఇప్పటికే ధరఖాస్తు కూడా పెట్టుకున్నామ‌ని... అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నామ‌ని తెలిపారు.

నిరుద్యోగులందరికీ ప్ర‌భుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలేదని....రాష్ట్రంలో 2లక్షలు ఖాళీలున్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే భర్తీ చేయాలని కోదండ‌రాం డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రావడంలేదని ఇప్పటికే ఇద్దరు యువకులు ఆత్మ‌హత్య చేసుకున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు స్పూర్తితో సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోదండ‌రాం డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగమైనా ఇవ్వాలి. లేదంటే నిరుద్యోగ భృతి అయినా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తాము లేవనెత్తిన 6 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోదండ‌రాం డిమాండ్ చేశారు. సమాజంలో రాజకీయాలు అనివార్యమ‌ని.. అవి బాగాలేనప్పుడు సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కోదండ‌రాం తెలిపారు. ప్రజాస్వామ్యంలో పౌరులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాపై ఉందని ఆయ‌న వెల్ల‌డించారు. ``మాకు వెనక్కిమళ్లే దారిలేదు. ఆరునూరైనా మా ప్రయాణం ముందుకే సాగుతుంది. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడాం. ఈ ప్రభుత్వం మాది. ప్రజల హక్కులకోసం కొట్లాడే హక్కు మాకు ఉంది.`` అని కోదండ‌రాం త‌న దారిని స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News