రంగాను చంపింది టీడీపీనే!... సాక్ష్యాలు ఇవిగో!

Update: 2019-01-25 07:17 GMT
దివంగ‌త వంగ‌వీటి మోహ‌న రంగాను అత్యంత కిరాత‌కంగా చంపేసింది టీడీపీ గూండాలేన‌ని మ‌రోమారు వైసీపీ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పింది. నిన్న మీడియా స‌మావేశంలో త‌న తండ్రి రంగా హ‌త్య‌కు కొంద‌రు వ్య‌క్తులే కార‌ణ‌మ‌ని, టీడీపీకి దానిని ఆపాదించ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ వెంట‌నే వైసీపీ నేత పేర్ని నాని రంగా హ‌త్య ఎలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూ... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ట్రాప్‌ లో ప‌డిపోయిన వంగ‌వీటి రాధాకృష్ణ... త‌న తండ్రిని హ‌త్య చేసిన పార్టీలోనే చేరిపోతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. తాజాగా రంగా అబిమానిగానే కాకుండా వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న సామినేని ఉద‌య‌భాను కూడా రంగా హ‌త్య‌పై చాలా క్లారిటీగా మాట్లాడారు. రంగాను హ‌త్య చేసింది ముమ్మాటికీ టీడీపీ గూండాలేన‌ని, ఆ హ‌త్య‌కు చంద్ర‌బాబు స్క్రీన్‌ ప్లే ర‌చించార‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

నాడు రంగాను అత్యంత కిరాత‌కంగా చంపేసిన ఘ‌ట‌న‌కు తాను ప్ర‌త్య‌క్ష సాక్షిన‌ని కూడా ఉద‌య‌భాను చెప్పుకొచ్చారు. అయితే నాటి ఘ‌ట‌న‌కు విరుద్ధంగా రాధా మాట్లాడుతుండ‌టం.,.. రంగా అభిమానిగా, వైసీపీ నేత‌గా బాధ‌ప‌డుతున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. చేగొండి హరిరామజోగయ్య ఆ రోజులలో మంత్రిగా ఉన్నారని, ఆయన రాసిన పుస్తకంలో కూడా రంగా హత్య వెనక చంద్రబాబు స్ర్కీన్ ప్లే వహించాడని రాశారన్నారు. రంగాని హత్య చేసింది టీడీపీ గూండాలు కాదని రాధా చెప్పటం బాధాకరమన్నారు. రాధా మాటలతో రంగా అభిమానులందరు బాధపడుతున్నారని తెలిపారు. రాధా నిన్న‌టి ప్రెస్ మీట్‌ లో మాట్లాడిన మాటలు చూస్తే... ఆయ‌న‌ టీడీపీలో చేరినట్లుగానే మాట్లాడారన్నారు. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి.. వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, రాధాను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని వెల్లడించారు.

అస‌లు వాస్త‌వాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేలా రాధా మాట్లాడుతున్నార‌ని, ఈ విష‌యంపై రంగా అభిమానులు తీవ్ర ఆవేద‌న చెందుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇక వైసీపీ పై విమ‌ర్శ‌లు గుప్పించిన రాధా కామెంట్ల‌కు ఉద‌యభాను త‌న‌దైన శైలి  కౌంట‌ర్లిచ్చారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం రాధా ఏ మేర ఉద్య‌మాలు చేశారో చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఏనాడైనా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై రాధా ఉద్య‌మాలు చేశారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలోనే రంగా గారి ఆత్మ ఘోషించేలా రాధా త‌ల్లి ర‌త్న‌కుమారి టీడీపీలో చేరార‌ని, ఈ ఘ‌ట‌న రంగా అబిమానుల‌ను ఎంత‌గానో క‌ల‌చివేసింద‌ని చెప్పిన ఉద‌యాభాను... ఇప్పుడు ఏకంగా రాధా కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డుతుండ‌టం మ‌రింత దారుణ‌మ‌న్నారు. రంగా అభిమానుల సంక్షేమం కోస‌మేనంటూ మాట్లాడుతున్న రాధా... వారి కోసం ప్ర‌భుత్వాల‌పై ఏ మేర‌కు పోరాటం చేశారో చెప్పాల‌ని కూడా డిమాండ్ చేశారు. మొత్తంగా రాధా మాట్లాడిన ప్ర‌తి కామెంట్ కు ఉద‌య‌భాను స‌మాధానం ఇచ్చేసిన‌ట్టుగానే చెప్పుకోవాలి.
Tags:    

Similar News