అల్లకల్లోలం:దేశవ్యాప్తంగా పౌరసత్వ ప్రకంపనలు

Update: 2019-12-16 05:14 GMT
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంతవరకూ ఈశాన్య రాష్ట్రాలకే ఆందోళనలు పరిమితమయ్యాయి. క్రమంగా ఇది ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది.

ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు - స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఉద్రికత్తకు దారితీసింది. ఆదివారం రాత్రంతా ఈ ఉదయం వరకూ నిరసనలు కొనసాగించారు. వీరి ఆందోళనల్లో ఆరు బస్సులు - నాలుగు పోలీసు వాహనాలకు నిప్పంటించారు.

ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఘర్షణకు దారితీసిన ఈ లాఠీచార్జిలో 60మంది గాయపడ్డారు. దీంతో ఢిల్లీలో 15 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్దకు వేలాది మంది చేరుకుని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

ఇక హింసకు పాల్పడిన వారు జేఎంఐ యూనివర్సిటీలో దాక్కున్నారని పోలీసులు రావడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. నిరసన తెలిపారు. ఆందోళనలతో ఆగ్నేయ డిల్లీలోని పాఠశాలలను సోమవారం మూసివేశారు.

ఇక అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లు ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య మరో రెండుకు పెరిగింది. మొత్తం కాల్పుల్లో ఐదుగురు మరణించారు. బెంగాల్ లో ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్లోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది.

ఇక అస్సాంలో బీజేపీ మిత్రపక్షంలో అసోం గణ పరిషత్ బీజేపీకి వ్యతిరేకంగా పౌరసత్వ సవరణ బిల్లుపై పోరాటం మొదలుపెట్టింది. చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
Tags:    

Similar News