కొత్త జిల్లాల కుంపటి

Update: 2016-08-23 07:11 GMT
తెలంగాణలో జిల్లాల పునర్విభజన పలు జిల్లాల్లో అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఉద్యమాలకు మారుపేరైన కరీంనగర్ - వరంగల్ జిల్లాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు.  అంతా సంబరాలనే ఫోకస్ చేస్తున్నప్పటికీ అంతకుమించిన స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను కొత్త జిల్లాల జాబితాలో నుంచి తొలగించడంతో ఆ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు.  అక్కడ వందలాది  ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లను రోడ్లపైనే నిలిపివేసి దిగ్భంధించారు.  కోరుట్లను రెవెన్యూ డివిజన్‌ గా ప్రకటించక పోవడాన్ని నిరసిస్తూ కోరుట్ల డివిజన్ సాధన కమిటీ అధ్వర్యంలో ధర్నా - రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం కోరుట్ల పట్టణ బంద్‌ కు పిలుపునిచ్చారు. అటు మెదక్ జిల్లా సిద్దిపేటలో కరీంగనర్ జిల్లాకు చెందిన హుస్నాబాద్ - కోహెడ మండలాలను కలపవద్దంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.  తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసినట్లుగానే రోడ్లపై వంటావార్పులు... దిగ్బంధనాలు చేస్తుండడంతో పాటు మహా ధర్నాలకు సిద్ధమవుతున్నారు. వీటిని ప్రభుత్వం ఎలా చల్లారుస్తుందో చూడాలి.

జిల్లాల పునర్విభజన ముసాయిదాలో సిరిసిల్లకు చోటు దక్కకపోవడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న ఆ ప్రాంతంమంతా రగులుతోంది. ఎల్లారెడ్డిపేటలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నాయకులు - విద్యార్థులు సోమవారం ఆందోళన బాట పట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో కామారెడ్డి - కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా - రాస్తారోకో కార్యక్రమాలను చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు బైఠాయించారు. మంత్రి కెటిఆర్ బొమ్మలను తగలబెట్టారు.

ఇక వరంగల్ జిల్లాలో అయితే జనగామ జిల్లా ప్రకటించనందుకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఎప్పుడూ తాము అందరి దిష్టి బొమ్మలు తగలబెట్టడమే కానీ తమపై ఇంతవరకు ఆ పరిస్థితి ఎన్నడూ లేకపోవడంతో టీఆరెస్ శ్రేణులు ఈ పరిణామాలకు కలవరపడుతున్నాయి. ప్రభుత్వం డ్రాఫ్ట్ విడుదల చేసిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు జెఎసి నాయకులను అదుపులోకి తీసుకున్నా కూడా అన్ని చోట్లా ఆందోళనలు ఉదృతంగా సాగుతున్నాయి. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News