రూ.కోటి వద్దు..2 కోట్లు మేమే ఇస్తాం మూసేయాలంటున్నారు!

Update: 2020-05-10 04:37 GMT
విశాఖను కుదిపేస్తున్న ఎల్ జీ పాలిమర్స్ ఉదంతంలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిలువెత్తు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ.. రసాయనాలు విడుదలైన దారుణ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవటమే కాదు.. అస్వస్థతతో వందలాది మంది ఆసుపత్రుల్లో చేరటం తెలిసిందే. ఈ ఉదంతంలో మరణించిన వారిని ఆదుకునేందుకు ఏపీ సర్కారు రూ.కోటి పరిహారాన్ని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. విపక్షాలు రూ.25 లక్షలు రూ30 లక్షలు పరిహారం ఇస్తే సరిపోతుందన్న మాటకు భిన్నంగా ఏపీ సర్కారు ఏకంగా రూ.కోటి పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటన ఇవ్వటంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటివేళ.. బాధితులు మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు అవుతారు.

పరిహారంగా ఇచ్చే కోటి రూపాయిలు అక్కర్లేదని.. మరణించిన తమ పిల్లను ఇస్తే చాలంటూ ఒక మహిళ రోదిస్తుంటే.. మరికొందరు బాధితులుసైతం ఇదే మాటను చెబుతున్నారు. మీరిచ్చే కోటి అక్కర్లేదు.. కావాలంటే మేమే చందాలు వేసుకొని రూ.2కోట్లు ఇస్తామని.. తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే కంపెనీని మూసివేయాలని.. అక్కడ ఉండకూదని తేల్చి చెబుతున్నారు.

రసాయనాలు పీల్చి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి మృతదేహాలను తీసుకొచ్చి ఎల్ జీ పాలిమర్స్ కంపెనీ ఎదుట టెంట్ ఏర్పాటు చేసి అక్కడ ఉంచారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాల్ని చేశారు. అధికారులు ఎంతలా నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా..వారి శోకం ముందు అవేమీ పని చేయలేదు. అంతకంతకూ పెరిగిపోతున్న ఆందోళనను అదుపు తెచ్చేందుకు వీలుగా.. పోలీసులు తమదైన మార్కును ప్రదర్శించటంపై అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీలో ఏదైనా జరిగితే..కనీసం అంబులెన్సుసౌకర్యం లేదని.. అలాంటి కంపెనీ తమ వద్ద ఉండేందుకు తాము ఒప్పుకోమని చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన నేపథ్యంలో.. ఇలాంటి ఆందోళనల్ని అంచనా వేయలేని అధికారులు.. తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
Tags:    

Similar News