మోడీ బంగ్లాదేశ్ పర్యటన.. పది మంది ప్రాణాలు పోయాయి

Update: 2021-03-29 07:57 GMT
భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఆ దేశంలో కొత్త రచ్చకు కారణమైంది. ఆయన పర్యటనను నిరసిస్తూ చేస్తున్న నిరసనలు మూడో రోజుసాగటమే కాదు.. హింస మరింత ఎక్కువైంది. ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బెంగాలీల మనసుల్ని దోచేందుకు ఆయన బంగ్లాదేశ్ పర్యటన చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బంగ్లాదేశ్ పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. దర్శించిన స్థలాల్ని చూసినప్పుడు బెంగాలీలే లక్ష్యమన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ బంగ్లాదేశ్ పర్యటనను నిరసిస్తూ ఆ దేశంలో సాగుతున్న నిరసన హింసాత్మకంగా మారింది. మదర్సాల్ని నిర్వహించే హెపాజత్ ఇ ఇస్లాం అనే సంస్థ ప్రధానంగా నిరసన తెలుపుతోంది. ఆదివారం దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఆందోళనకారులు చేపట్టిన నిరసనలో రైలుతో సహా ప్రభుత్వ వాహనాల్ని తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు దేవాలయాల మీద కూడా దాడి జరిగింది.

ఆందోళనల్ని అదుపులోకి తెచ్చేందుకు వీలుగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు పది మందికి చేరటం గమనార్హం. ప్రెస్ క్లబ్ మీదనే కాదు.. పాత్రికేయుల మీదా దాడి జరగటం గమనార్హం. రహదారుల మీద ఎక్కడికక్కడ ఇసుక బస్తాలు.. పెద్ద పెద్ద దుంగల్ని ఉంచటం ద్వారా తమ నిరసనను చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్ని అడ్డుకునేందుకు లాఠీ చార్జీలు.. భాష్పవాయువును ఉపయోగించటం కారణంగా పలువురు గాయపడ్డారు. బంగ్లాదేశ్ పర్యటనను మోడీ ఎందుకు చేస్తున్నారన్న దానికి సరైన కారణం ఏమిటన్నది ఇప్పటివరకు బయటకు వెల్లడి కాలేదు. కానీ.. ఆయన పర్యటన కారణంగా పది మంది ప్రాణాలు పోవటం మాత్రం అయ్యో అనుకునేలా చేయటం ఖాయం.
Tags:    

Similar News