అనంతలో ‘ప్రత్యేక హోదా’ హైటెన్షన్

Update: 2016-05-09 09:42 GMT
విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి తెలిసిందే. ప్రత్యేక హోదా అవసరం లేదంటూ ఇటీవల కేంద్రమంత్రులు వ్యాఖ్యానించటం.. దీనిపై అధికార.. విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. ఏపీ విపక్షాల కంటే ఘాటుగా ఏపీ తెలుగు తమ్ముళ్లు తొలుత చెలరేగిపోవటం.. ఆ తర్వాత కాస్త కామ్ కావటం తెలిసిందే. ఏపీ అధికారపక్షం వ్యవహరించినట్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని విపక్షాలు తేలిగ్గా తీసుకునేటట్లు కనిపించట్లేదు. విభజన సమయంలో ఏపీలోని అనంతపురం జిల్లా ఎంతగా రగిలిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు.

తాజాగా ప్రత్యేక హోదా  అంశం మీదా అనంతపురంలో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తుండగా.. తాజాగా దీనికి వామపక్షాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తమ మద్దుతును ప్రకటించారు. సోమవారం ఉదయం పలువురు వామపక్ష వాదులు.. విద్యార్థులు కలిసి పెద్ద ర్యాలీగా సాధనా సమితి నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షల వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా వారిని మధ్యలోనే అడ్డుకున్న పోలీసుల తీరుతో ఆందోళనాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసుల్ని ప్రశ్నించిన ఆందోళనకారులకు.. పోలీసుల నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆందోళనకారుల్ని ముందుకు వెళ్లనిచ్చేది లేదంటూ పోలీసులు తేల్చి చెప్పిన నేపథ్యంలో.. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు వామపక్ష నేతలు.. విద్యార్థులు  ప్రయత్నించటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సున్నిత అంశాల విషయంలో పోలీసుల తీరు మరోలా ఉంటే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News