నిన్న తమిళనాడులో ఏం జరిగింది?

Update: 2016-09-14 04:31 GMT
కావేరీ జలాల ఇష్యూ తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్లో చిచ్చురేపి.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్ని నెలకొనేలా చేయటం తెలిసేందే. కావేరీ ఇష్యూకు సంబంధించి తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా.. కర్ణాటకలో పెద్ద విధ్వంసమే చోటు చేసుకుంది. కర్ణాటకలోని తమిళనాడుకు చెందిన ఆస్తులపై భారీఎత్తున దాడులు జరగటమే కాదు.. తమిళ వ్యక్తులపై దాడి జరిగినట్లుగా సమాచారం. ఉద్యాననగరిగా పేర్కొనే బెంగళూరు తగలబడిపోతుందన్న ఆందోళన వ్యక్తమైన వేళ.. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను.. మరికొన్ని ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూను విధించి పరిస్థితిని కాస్తంత అదుపులోకి  తీసుకొచ్చారు.

కేంద్ర భద్రతా బలగాలు కర్ణాటకలో మొహరించి.. శాంతి భద్రతల్ని పర్యవేక్షించారు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి ఉన్న వేళ.. తమిళనాడులో మంగళవారం ఏం జరిగింది? రేపేం (గురువారం) జరగనుంది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సోమవారం చెదురుముదురు ఘటనలో చోటు చేసుకోగా.. మంగళవారం పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సోమవారం కర్ణాటకలో తమిళనాడుకు చెందిన ఆస్తులకు జరిగిన నష్టానికి ప్రతీకారం అన్నట్లుగా మంగళవారం తమిళనాడులోని పలుచోట్ల ఆందోళనలు.. విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. కర్ణాటక వాహనదారులు తమ నెంబరు ప్లేట్లకు తమిళనాడు నెంబరు ప్లేట్లు వేసుకొని తిరగాల్సి వచ్చింది.

కర్ణాటకకు చెందిన బ్యాంకులకు.. ఇతర కార్యాలయాలకు బందోబస్తు ఏర్పాటు చేసినా ఆందోళనకారులు.. నిరసనకారులు చెలరేగిపోయారు. ఒక్క చెన్నైలోనే కర్ణాటకకు చెంది కార్యాలయాలకు.. హోటళ్లకు.. ఎటీఎంలకు పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేసినా.. నిరసనకారుల నుంచి ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకుంది. కర్ణాటక రిజిష్ట్రేషన్ ఉన్న బస్సు సోమవారం రాత్రి చెన్నైకి బయలుదేరింది. బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సుపై కోయంబత్తూరు జిల్లా నుంచి బయలుదేరింది. ఈ బస్సును అర్థరాత్రి వేళ అడ్డుకొని ధ్వంసం చేయటం గమనార్హం.

కర్ణాటకకు చెందిన బ్యాంకుల మీదా.. ఏటీఎంల మీద ఆందోళకారులు టార్గెట్ చేశారు. వాటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఓపక్క ఆందోళనకారుల చర్యలు ఇలా సాగుతుంటే.. మరోవైపు తమిళ పార్టీలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా చేసేలా పిలుపునివ్వటం గమనార్హం. పలు తమిళపార్టీలు రేపు (గురువారం) రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వగా.. 16న రైల్ రోకోను నిర్వహించనన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కావేరీ హక్కుల సాధన ర్యాలీని బుధవారం నిర్వహించాలని నాన్ తమిళర్ కట్చి పిలుపునిచ్చింది. ఇదా ఉండగా.. డీఎండీకే అధినేత విజయ్ కాంత్ తాజా పరిణామాలపై నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు.. రాజకీయ పార్టీలు మరింత సంయమనంతో వ్యవహరించాల్సి ఉంది. అందుకు భిన్నంగా తమిళ రాజకీయ పార్టీలు వరుసగా నిరసనలు.. ఆందోళనలు ప్రకటించటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News