ఆ సైకో ఏడాదికి రూ.18లక్షల జీతగాడు

Update: 2015-12-22 05:47 GMT
కరీంనగర్ పట్టణంలోని కమాన్ సెంటర్ లో మంగళవారం ఉదయం ఒక సైకో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల్ని మొదలుకొని.. కనిపించిన వారిని కనిపించినట్లుగా గాయపరుస్తూ.. హల్ చల్ చేసిన ఈ సైకో పై సీఐ జరిపిన కాల్పులతో మరణించారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు.. మృతుడికి సంబంధించి వివరాలు విస్మయానికి గురి చేసేలా ఉండటం గమనార్హం.

కరీంనగర్ లోని లక్ష్మీనగర్ కు చెందిన బల్వీందర్ సింగ్.. బెంగళూరులో ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. అతనికి ఏం జరిగిందో తెలీదు కానీ.. మంగళవారం ఉదయం బల్వీందర్ సింగ్ తన తండ్రి అమృత్ సింగ్.. తల్లి బేబీ కౌర్ లను కత్తితో పొడిచి గాయపర్చారు. అనంతరం వారిని తీవ్రంగా తిడుతూ.. కత్తి పట్టుకొని బయటకు రావటమే కాదు.. వీధిలో ఉన్న మినీ వ్యాన్ అద్దాల్ని పగలగొట్టాడు. అటుగా వెళుతున్న ఒక ఆటో డ్రైవర్ పై దాడి చేసి గాయపర్చాడు.

ఇతగాడి ఉన్మాదానికి భీతిల్లిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇతన్ని అదుపులోకి తీసుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ ప్రయత్నించగా.. అతని చేతి వేలికి నరికేశాడు. ఈ నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడికి పాల్పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీఐ అతనిపై కాల్పులు జరిపారు. దీంతో కుప్పకూలిపోయిన అతగాడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

నమ్మలేని విషయం ఏమిటంటే.. ఇంత రచ్చ చేసిన బల్వీందర్ సింగ్.. బెంగళూరులోని ఐటీ కంపెనీలో ఏడాదికి రూ.18లక్షల జీతంతో పని చేస్తున్నట్లు చెబుతున్నారు. నిన్నటి వరకూ బాగుంటూ.. అందరి చేత మర్యాద.. మన్ననలు పొందిన అతగాడు.. ఉన్నట్లుండి ఇంత సైకోలా వ్యవహరించటానికి కారణం ఏమిటి? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటన్నది అర్థంకాని మిస్టరీగా మారింది. ఇక.. ఇతనికి సంబంధించిన వివరాలు బయటపెట్టేందుకు వారి కుటుంబ సభ్యులు పెదవి విప్పటం లేదు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ జీతంతో పని చేస్తున్న ఒక వ్యక్తి ఇంత ఉన్మాదిలా ఎందుకు మారాడన్న విషయాన్ని విచారణలో తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News