పబ్ గబ్బు.. 5 కోట్లు ఏమయ్యాయి..?

Update: 2022-04-08 02:41 GMT
తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ లో 148 మందిని అదుపులోకి తీసుకోగా.. ఆ రోజు పబ్ కు 250 మందికి పైగా వచ్చినట్లు గుర్తించారు. మిగతా వారి కోసం సీసీటీవీ ఫుటేజ్ - కస్టమర్ల లిస్ట్ ఆధారంగా ఆరాలు తీస్తున్నారు.

పబ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ కాబడిన అభిషేక్ - అనిల్ కుమార్ ల ఫోన్ల ద్వారా వినియోగదారుల వివరాలను తెలుసుకుంటున్నారు. కాల్ డేటా - వాట్సప్ చాటింగ్ డేటా సేకరిస్తున్నారు. వాట్సాప్ లో 70 గ్రూపులకు వీరు అడ్మిన్ గా ఉన్నారని.. ఎప్పటికప్పుడు చాటింగ్ ను డిలీట్ చేస్తున్నట్లు గుర్తించారు.

ఇకపోతే పబ్ లో స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో డేటాని కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. పబ్ లో జరిగే ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తు చేయనున్నారు. ఎంతమంది మెంబర్స్ గా జాయిన్ అయ్యారు.. ఎంత మొత్తంలో మనీ డిపాజిట్ చేశారు.. మనీ అడ్వాన్స్ గా చెల్లించి ఎందుకు రిజిస్టర్ అయ్యారు.. డిపాజిట్ చేశారని అంటున్న ఐదు కోట్ల మనీ ఏమైంది? ఎక్కడ ఉంది? అనే విషయాలపై పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోందని అంటున్నారు.

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కు రెగ్యులర్ గా వచ్చే 20 మంది కొన్ని నెలలుగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో కొందరు కొకైన్‌ ను వేడిచేసి ఆవిరిని పీల్చుకుంటున్నారని.. మరికొందరు అనుమానం రాకుండా కూల్ డ్రింక్స్ లో కలుపుకుంటారని తెలుసుకున్నారు. కొకైన్‌ ను పబ్‌ లోకి ఎవరు తెస్తున్నారనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు.

అలానే ఈ కేసులో నిందితులైన అర్జున్‌ వీరమాచనేని - కిరణ్‌ రాజ్‌ లపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న వీరిద్దరూ దేశం విడిచి పారిపోకుండా పాస్‌ పోర్టు వివరాలను తెలుసుకుని అన్ని ఎయిర్ పోర్ట్ లకు పంపించారని తెలుస్తోంది.

మరోవైపు ఆదివారం పబ్ లో నిర్వహించిన దాడులలలో 4.64 గ్రాముల కొకైన్‌ను గుర్తించామని.. ఇద్దరిని అరెస్ట్‌ చేసి మూడు ఫోన్లు - ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారని తెలుస్తోంది.

అలానే రిమాండ్ ఖైదీలుగా ఉన్న అభిషేక్ - అనిల్ కుమార్ లను వారం రోజులు కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును అభ్యర్థించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పబ్ వ్యవహారాలన్నీ తెలుస్తాయని? డ్రగ్స్ ఎలా వచ్చింది ? ఎవరు తెచ్చారు? దీని వెనకున్న అసలు సూత్రధారులను పట్టుకునే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Tags:    

Similar News