ఎన్నిక‌ల ముందు చిక్కుల్లో కాంగ్రెస్ సీనియ‌ర్‌

Update: 2018-11-19 10:01 GMT
దిగ్విజయ్ సింగ్...కాంగ్రెస్ సీనియర్ నేత - మధ్యప్రదేశ్ మాజీ సీఎం. తెలుగు గ‌డ్డ‌పై రాజ‌కీయాల గురించి క‌నీస అవ‌గాహ‌న ఉన్న‌వారంద‌రికీ సుప‌రిచితుడైన కాంగ్రెస్ నేత‌. తెలుగు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో కీలక పాత్ర పోషించిన ఈ నేత త‌న ఇలాకాలో ఎన్నిక‌ల స‌మ‌యంలో చిక్కుల్లో పడ్డారు. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న కేసులో పుణె పోలీసులు డిగ్గీ రాజాను ప్రశ్నించనున్నారు. ఈ మధ్య మావోయిస్టుల దగ్గర బయటపడిన లేఖలో దొరికిన ఫోన్ నంబర్ దిగ్విజయ్‌దేనని పోలీసులు నిర్ధారించారు. దిగ్విజయ్‌ ను స్నేహితుడిగా చెబుతూ ఆయన ఫోన్ నంబర్‌ ను ఆ లేఖలో మావోయిస్టులు రాయడం విశేషం. పుణె డీసీపీ సుహాస్ భావ్చె కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇటీవ‌ల మావోయిస్టుల ద‌గ్గ‌ర దొరికిన స‌మాచారాన్ని అధ్య‌య‌నం చేస‌సిన పోలీసులు ఈ క్ర‌మంలో మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నారు.మావోయిస్టు నేతలతో ఈ మధ్య అరెస్టయిన సామాజిక కార్యకర్తలకు కూడా సంబంధాల ఉన్నట్లు నిరూపించడంలో భాగంగా ఈ లేఖను పోలీసులు కోర్టుకు సమర్పించారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడంలో తమకు సహకరించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నట్లు కమాండర్ సురేంద్రకు రాసిన లేఖలో కమాండర్ ప్రకాశ్ వెల్లడించాడు.ఈ కేసులో ఇంకా చాలా వరకు విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెప్పారు. ఇప్పుడు దిగ్విజయ్‌ ను కూడా పిలిచి విచారిస్తామని వాళ్లు స్పష్టం చేశారు. ఇప్పుడు మావోయిస్టుల లేఖలోని ఫోన్ నంబర్ దిగ్విజయ్‌ దేనని తేలడంతో ఎన్నికల ముందు ఆయనపై తన దాడిని మరింత పెంచారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్. అయితే తాను మాత్రం అమాయకుడినని - దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు దిగ్విజయ్ సవాలు విసరడం విశేషం.

ఇదిలాఉండ‌గా...సొంత రాష్ట్రంలో దిగ్విజ‌య్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. రానున్న మధ్యప్రదేశ్ - రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని బహుజన్ సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్ మాయావతి తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఆమె విరుచుకుపడ్డారు. బీఎస్పీని తుదముట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని - ఆ పార్టీ నేతలు పొత్తుకు తూట్లు పొడుస్తున్నారని ఆమె విమర్శించారు. పొత్తు చెడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగే కారణమని ఆమె ఆరోపించారు. ఆయనో బీజేపీ ఏజెంట్ అని విమర్శించారు. తమతో పొత్తు పెట్టుకుంటే కేంద్రం తనపై ఎక్కడ ఈడీ - సీబీఐలను ప్రయోగిస్తోందనని దిగ్విజయ్ భయపడ్డారని మాయావతి విమర్శించారు. తనపైనే కేంద్రం ఒత్తిడి కారణంగా పొత్తుకు వెనుకాడుతున్నట్లు దిగ్విజయ్ ఆరోపించడాన్ని ఆమె ఖండించారు. రాహుల్ - సోనియా గాంధీలను మాత్రం ఆమె వదిలేశారు. బీజేపీని ఒంట‌రిగా ఓడించ‌డం కాంగ్రెస్ వ‌ల్ల కాద‌ని ఈ సంద‌ర్భంగా మాయావ‌తి స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News