పుంగనూరు గ్రౌండ్ రిపోర్టు: పెద్దిరెడ్డిని కొట్టగలరా?

Update: 2019-03-19 14:30 GMT
అసెంబ్లీ నియోజకవర్గం : పుంగనూరు
టీడీపీ : నూతనకాల్వ అనీశా రెడ్డి
వైసీపీ:  పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి
జనసేన: బీ. రాంచంద్రయాదవ్

-----------------------------
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఆది నుంచి ఆర్థిక బలం, రాజకీయ అనుభవం ఉన్నవారికే పట్టం కడుతోంది. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉండి.. దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. పుంగనూరు నియోజకవర్గంపై టీడీపీ ఎంత దృష్టి పెట్టినా గెలుపు మాత్రం సాధ్యపడడం లేదు. ఆనవాయితీకి భిన్నంగా ఇక్కడ టీడీపీ ఆరు నెలల ముందే అభ్యర్థిని ఎంపిక చేసింది. మరి ఆ లేడీ అభ్యర్థి బలమైన వైసీపీ పెద్దాయనను ఓడిస్తారా లేదా అన్నది పుంగనూరులో హాట్ టాపిక్ గా మారింది..

* పెద్దిరెడ్డి వర్సెస్ అనీశా రెడ్డి
రాజకీయ అనుభవం, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న వైసీపీ పుంగనూరు  ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంలో తిరుగులేకుండా ఉన్నారు. పెద్దిరెడ్డికి కోటలుగా ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరోవైపు ఈసారి టీడీపీతో పాటు జనసేన అభ్యర్థి కూడా రంగంలోకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. పెద్దిరెడ్డికి ధీటైన అభ్యర్థిగా అనీషారెడ్డిని ఆరు నెలల కింద టీడీపీ తెరపైకి తెచ్చింది. పుంగనూరు టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ రెడ్డి సతీమణి ఈమె. న్యాయశాస్త్రంలో  పట్టభద్రురాలు. రాజకీయ కుటుంబానికి కోడలు, ఉన్నత చదువులు చదవడంతో టికెట్ ను బాబు కేటాయించారు. పైగా ఈమె పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్తున్నారు.

*జనసేన అభ్యర్థి బలమైన వారే..
ఇక పుంగనూరు నియోకవర్ంలోని దాసర్లపల్లెకు చెందిన బీ. రాంచంద్రయాదవ్ కు జనసేన పుంగనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. కొంతకాలంగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యాడు. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. పరిశ్రమలు, ఆస్పత్రులున్నాయి.ఆర్థిక బలం పుష్కలంగా ఉండడం ప్లస్ గా మారింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న యాదవ సామాజికవర్గం ఈయన వెంట ఉంది.

*బలం, బలగం..
వైసీపీ పుంగనూరు అభ్యర్థి పెద్దిరెడ్డి ఈసారి జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలపైనే ప్రచారం చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారు. వ్యూహకర్తగా, రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడిగా పెద్దిరెడ్డికి పేరుంది. ఇక అనీషా రెడ్డి మాత్రం కొత్త గా రాజకీయాల్లోకి వచ్చారు. అధికారంలో ఉన్న టీడీపీ మద్దతుతో దూకుడుగా వెళ్తున్నారు. టీడీపీ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆశతో ఉన్నారు. క్లీన్ ఇమేజ్ కలిసివస్తుందని భావిస్తున్నారు. వారి కుటుంబం అనాధిగా రాజకీయాల్లో ఉండడంతో వారి మద్దతుతో ప్రజలకు చేరువవుతున్నారు. జనసేన అభ్యర్థి కూడా ఓట్లు చీల్చి నష్టం చేకూర్చేలానే ఉన్నారు.

*అంతిమంగా పెద్దిరెడ్డికే చాన్స్
పుంగనూరు నుంచి ఇప్పటికే మూడోసారి పెద్దిరెడ్డి బరిలో నిలుస్తున్నారు. వైసీపీలో ఉన్న ఈయన సీనియర్ నేత. రాజకీయాలు కొట్టిన పిండి. పీలేరులో నాలుసార్లు గెలిచారు. అనంతరం పుంగనూరుకు మారి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. వైఎస్ హయాంలో అటవీ శాఖ మంత్రిగా చేశాడు. ఈయన ముందు టీడీపీ అభ్యర్థి అనీశారెడ్డి నిలబడడం కష్టమేనన్న భావన నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్టులో తేలింది.

    

Tags:    

Similar News