బిగ్ బ్రేకింగ్ : మరో ముఖ్యమంత్రి రాజీనామా !

Update: 2021-09-18 12:54 GMT
కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్‌ భవన్ వెళ్లి గవర్నర్‌ కు అందించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆయన తన నివాసం నుంచి రాజ్‌ భవన్ వెళ్లారు. అక్కడికి చేరుకుని గవర్నర్‌ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ గవర్నర్‌ ను కలిశారని, తన రాజీనామాతోపాటు క్యాబినెట్ మంత్రుల రాజీనామాలను సమర్పించినట్టు పంజాబ్ సీఎం మీడియా అడ్వైజర్ రవీన్ తుక్రాల్ వెల్లడించారు. మరికొద్దిసేపట్లో రాజ్‌భవన్ గేట్ ముందు మీడియాతో మాట్లాడనున్నట్టు తెలిపారు. తండ్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేయనున్నట్టు కొద్దిసేపటి క్రితమే కుమారుడు రణీందర్ సింగ్ ధ్రువీకరించారు. అనంతరం గవర్నర్‌ కు రాజీనామా పత్రాన్నీ అందించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

పంజాబ్‌లో కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభం రగులుతూనే ఉన్నది. సిద్దూ నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై ధిక్కారాన్ని వెల్లడించారు. పంజాబ్‌లో కొంతకాలంగా సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంపై సొంతపార్టీ నుంచే విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నవ్‌జోత్ సింగ్ సిద్దూ నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీరిరువురి మధ్య వైరం పతాకస్థాయికి చేరింది. ఇరువురూ అదిష్టానంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కావాలని డిమాండ్ చేసే దాకా పరిస్థితులు వెళ్లాయి. అదిష్టానం చొరవ తీసుకుని సిద్దూను శాంతింపజేశాయి. పంజాబ్ కాంగ్రెస్ విభాగానికి చీఫ్ పదవి ఇచ్చి ఉపశమనం చేశాయి.

కానీ, ఈ చర్య దీర్ఘకాలిక ఫలితాలనిచ్చినట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సిద్దూ ఈ రోజు సీఎల్పీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నది. ఇందులో తనను సముచిత స్థానాన్ని ఇవ్వకపోవడంపై సింగ్ అసంతృప్తి చెందినట్టు తెలిసింది. ఇలాగే పార్టీ సమావేశాల్లో తనను పక్కనపెడితే సీఎం పదవి నుంచి వైదొలుగుతానని సోనియా గాంధీకి తెలిపినట్టు సమాచారం. ఈ మీటింగ్ మళ్లీ పాత వివాదాన్నే ముందుకు తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని నెలలే ఉన్న సందర్బంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు తెరలేసింది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్య‌మంత్రిని సొంత‌పార్టీలో విమ‌ర్శించే వ్య‌క్తులు ఎక్కువ కావ‌డంతో విసుగు చెందిన సీఎం ఈరోజు రాజీనామా చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు పంజాబ్ కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం స‌మావేశం కాబోతున్నది. అమ‌రీంద‌ర్ సింగ్ వార‌సుడిని ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌డంతో ఆ రాష్ట్ర రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.




Tags:    

Similar News