ఆశీర్వాదం కోడ‌లికి, ప్ర‌చారం బీజేపీకి !

Update: 2018-11-27 15:49 GMT
కూక‌ట్ పల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా ఉంది. నంద‌మూరి ఇంటి అమ్మాయి అనూహ్యంగా పోటీకి దిగ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తోంది. ప్ర‌జాకూట‌మి త‌ర‌ఫున ఆమె పోటీ చేస్తుండ‌గా... ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి నంద‌మూరి కుటుంబం వ‌స్తోందని ప్ర‌చారం జ‌రిగింది. అయితే  ఆ కుటుంబంలో ఉన్న న‌టులంతా వస్తారా? ఎంత మంది వ‌స్తారు? వ‌ంటి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు  నా కోడ‌లికి నా ఆశీర్వాదాలు ఎపుడూ ఉంటాయ‌ని రెండు మూడు రోజుల క్రితం ప్ర‌క‌టించిన సుహాసిని మేన‌త్త‌ పురంధేశ్వ‌రి ఈరోజు బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.
 
ప్ర‌జా కూట‌మి అభ్య‌ర్థి అయిన‌ కోడలిని ఓడించండి...  బీజేపీ అభ్య‌ర్థిని గెలిపించండి అని వసంత్ నగర్ నుంచి మూసాపేట వరకు ఆమె ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) - కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - తెలంగాణ జన సమితిలతో కూడిన ప్ర‌జా కూటమిపై విమర్శలు చేశారు. నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం ఏమీ చేయ‌లేద‌ని చెప్పిన ఆమె  భావసారుప్యం లేని పార్టీలన్నీ ఏకమై ప్రజా కూటమిగా ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే... ఎన్టీ రామారావు - క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌చారానికి రావ‌డంపై మీమాంస‌లో ఉంటే సుహాసిని మ‌రోసోద‌రుడు తార‌క‌ర‌త్న రంగంలోకి దిగి సోద‌రి త‌ర‌ఫున ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఈరోజు పాద‌యాత్ర కూడా నిర్వ‌హించారు. క‌ళ్యాణ్‌రామ్ కూడా త్వ‌ర‌లో ప్ర‌చారానికి రాబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది క్లారిటీ అయితే ఇవ్వలేదు.  అయితే, ఎన్టీఆర్‌ వస్తాడా లేక రాడా అనేది పూర్తి డైల‌మాలో ఉంది. దీనిని కూడా బెట్టింగ్ రాయుళ్లు వాడుకుని ఎన్టీఆర్ వ‌స్తార‌ని కొంద‌రు, రారు అని కొంద‌రు పందాలు వేసుకుంటున్నారు. సుహాసిని అభ్య‌ర్థిగా ఖ‌రారు కావ‌డం కంటే ముందుగా ఎన్టీఆర్ మూవీ షెడ్యూల్ ఖ‌రారు కావ‌డంతో సినిమా వ‌ల్ల రాక‌పోవ‌చ్చ‌ని కొంద‌రు అంటున్నా... ఏదో ఒక గ్యాప్‌లో వ‌స్తారేమో అని నియోజ‌క‌వ‌ర్గంలోని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం ర‌క‌ర‌కాలుగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆస‌క్తిని త‌న‌వైపు తిప్పుకుంటోంది.
Tags:    

Similar News