రాజ్య‌స‌భ‌కు పురందీశ్వ‌రి..రాష్ట్రం కూడా ఖరారైంది

Update: 2018-02-24 04:27 GMT
మాజీ కేంద్ర మంత్రి - ఏపీకి చెందిన‌ బీజేపీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన ద‌గ్గుబాటి పురందీశ్వ‌రికి త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్ ద‌క్కనుందా?  ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పురందీశ్వ‌రిని జాతీయ రాజ‌కీయాల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ పెద్ద‌లు సిద్ధ‌మవుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వివిధ మీడియా వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్రచారం నిజ‌మైతే...త్వ‌ర‌లోనే ద‌క్షిణాదిలో బీజేపీకి అత్యంత కీల‌క‌ రాష్ట్రమైన క‌ర్ణాటక‌ రాజ‌కీయాల్లోకి పురందీశ్వ‌రి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

తాజాగా వెలువ‌డిన రాజ్య‌స‌భ షెడ్యూల్ ప్ర‌కారం ఈ చ‌ర్చ మొద‌లైంది. తాజా షెడ్యూల్ ప్ర‌కారం మొత్తం 16 రాష్ర్టాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో క‌ర్ణాట‌క కూడా ఉంది. క‌ర్ణాట‌క‌లో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండ‌గా అందులో ఒక స్థానానికి పురందీశ్వ‌రిని బ‌రిలో దింపుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు పార్టీ వ‌ర్గాలు ప‌లు ర‌కాల కార‌ణాలు వెల్ల‌డిస్తున్నాయి. పార్టీలో చేరింది మొద‌లుకొని ఇప్ప‌టివ‌ర‌కు నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేయ‌డం - పార్టీ బ‌లోపేతానికి కృషిచేయ‌డం ప్ర‌ధాన కారణంగా చెప్తున్నారు. దీంతోపాటుగా త్వ‌ర‌లో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం మ‌రో కార‌ణంగా వివ‌రిస్తున్నారు.

క‌ర్ణాట‌క‌లో క‌న్న‌డిగుల త‌ర్వాత అత్య‌ధికులు తెలుగువారే. దివంగ‌త విఖ్యాత నటుడు ఎన్టీఆర్ వారంద‌రికీ సుప‌రిచ‌తుడు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ త‌న‌య‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా ఆ రాష్ట్రంలోని తెలుగువారికి సానుకూల సందేశం పంపించిన‌ట్లు అవుతుంద‌ని అంటున్నారు. త‌ద్వారా రాబోయే ఎన్నిక‌ల్లో వారి ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని బీజేపీ పెద్ద‌ల ఆలోచ‌న‌గా వివ‌రిస్తున్నారు. రాబోయే కొద్దిరోజుల్లో ఈ మేర‌కు స్ప‌ష్ట‌త రానుందని అంటున్నారు. మ‌రోవైపు పురందీశ్వ‌రికి సైతం అనుకూల‌మైన పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం లేని నేప‌థ్యంలో...రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డ‌మే స‌రైన నిర్ణ‌య‌మ‌ని కొంద‌రు వివ‌రిస్తున్నారు.

Tags:    

Similar News