కమల సారధ్యం పై చిన్నమ్మ కల

Update: 2018-04-02 09:37 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకే కొత్త సారధి కాబోయేది ఎవరు? అనే విషయంలో మొన్న మొన్నటిదాకా చాలా ఊహాగానాలు నడిచాయి. తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి వెరపు లేకుండా ఎదురుదాడి చేయగల వారికోసమే పార్టీ అన్వేషించింది. ఆ క్రమంలో... కంభంపాటి హరిబాబును పక్కన పెట్టి, సోము వీర్రాజు - కన్నా లక్ష్మీనారాయణ - పురందేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రస్తుతం ఈ ప్రాబబుల్స్ జాబితాలో కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. తాను నేరుగా పగ్గాలు చేపట్టకుండా... తన వర్గీయుడిని ఆ పదవిలో పెట్టడానికి చిన్నమ్మ పురందేశ్వరి మొగ్గుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలుగుదేశంతో ప్రతిష్టంభన ఏర్పడిన తరువాత... అధ్యక్షుడిగా కంభంపాటి పేరును అమిత్ షా మరొకసారి ప్రకటించారు. తాజాగా పార్టీలో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆయన నియామకం తాత్కాలికమే అని, కర్ణాటక ఎన్నికల తరువాత.. పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించదానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నదని తెలుస్తోంది. ఆ మేరకు కొత్తగా షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో సోము వీర్రాజు - పురందేశ్వరి పేర్లు పక్కకు పోయినట్లు తెలుస్తోంది. తాజా జాబితాలో పైడికొండ మాణిక్యాలరావు - కన్నా లక్ష్మీ నారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వీరిలో ఆరెస్సెస్ మద్దతు పైడికొండ కే  ఉన్నది. కానీ, బీజేపీ లో కూడా అధిష్టానం వద్ద తన మాటకు విలువ కలిగి ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి... కాంగ్రెస్ లో ఉన్న కాలం నుంచి తనకు, అనుకూలుడనే అభిప్రాయంతో కన్నా లక్ష్మీనారాయణ కు సారధ్యం అప్పగించేలా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్న తరువాత... ఆయన మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేయడానికి సమర్థుడిని పార్టీ వెతుకుతోంది. కన్నా అయితే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పై విరుచుకు పడడానికి తన మద్దతు కూడా ఉంటుందని పురందేశ్వరి సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. మరి కన్నడ ఎన్నికల తరువాత... పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News