అధినాయకత్వానికి భజన చిన్నమ్మకు మామూలే?

Update: 2016-03-06 04:37 GMT
కొంపలు మునిగిపోతున్నా.. పెద్దగా పట్టించుకోని వైనం. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కంటే కూడా తన వ్యక్తిగత ప్రయోజనం నెరవేరితే చాలన్న వైఖరి కొందరి నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారి వల్ల ప్రజలకు ప్రయోజనం సంగతేమో కానీ.. నష్టం మాత్రం భారీగా ఉంటుంది. తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎలాంటి నిర్ణయాన్ని అయినా సరే సమర్థించటం.. ప్రజల దృష్టి కోణంలో చూసే అలవాటు లేకపోవటం కొందరు నేతలకు మామూలే. అలాంటి నేతల్లో ఏపీకి చెందిన పురంధేశ్వరి ఒకరని చెప్పాలి.

ఏ తెలుగు ప్రజల కోసం విపరీతంగా తపించటమేకాదు.. తెలుగోడి ఘనకీర్తిని ప్రపంచమంతా చాటిన ఎన్టీవోడి కడుపున పుట్టిన పురంధేశ్వరి అలియాస్ చిన్నమ్మలో చిత్రమైన కోణం ఉంది. తండ్రి మాదిరి ప్రజల గురించి ఆమె ఆలోచనలు చాలా తక్కువ. ఎంతసేపటికి తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ ప్రయోజనాలే తప్పించి.. తమ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న తెలుగు ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆమెలో పెద్దగా కనిపించదు.

ఎక్కడిదాకానో ఎందుకు రాష్ట్ర విభజన వ్యవహారాన్నే తీసుకుంటే.. తాను ఏ నియోజకవర్గంలో నిలుచున్నా.. అక్కునచేర్చుకునే ఏపీ ప్రజలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నా నోరు విప్పింది లేదు. విభజన అనివార్యమన్న విషయం అర్థమైనప్పుడు ఏపీ ప్రయోజనాల కోసం ఆమె ఎంతమేర పోరాడారో.. ఆమె చేసిన కృషి కారణంగా ఏపీకి జరిగిన లాభం ఏమిటో అందరికి తెలిసిందే.

ఎంతసేపటికి తనకు మంత్రి పదవిని ఇచ్చిన సోనియా ఫ్యామిలీకి విధేయురాలిగా ఉంటూ.. విభజన తర్వాత కాంగ్రెస్ కు జరిగే డ్యామేజ్ ని గుర్తించి.. తెలివిగా పార్టీ మారారే తప్పించి.. సోనియమ్మ దగ్గర తనకున్న పలుకుబడిని ఏపీ ప్రయోజనాల కోసం ఆమె ఖర్చు పెట్టింది పెద్ద లేదనే చెప్పాలి. విభజన విషయాన్ని పక్కనపెడితే.. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె.. ఇప్పటికి ఏపీ ప్రయోజనాల గరించి మాట్లాడుతున్నది లేదు.

విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చే హామీలేమిటో పురంధేశ్వరికి తెలియనివి కావు. కానీ.. వాటి అమలు ఏమిటన్న విషయంపై ఆమె సమాధానం ఇస్తే బాగుంటుంది. ప్రత్యేక హోదా మొదలు.. కీలక హామీలు ఏవీ ఇప్పటివరకూ అమలు కాలేదన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోని పురంధేశ్వరి.. తాజాగా ప్రవేశ పెట్టిన రైల్వే.. సాధారణ బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి అన్యాయం జరగలేదని చెప్పటం గమనార్హం.

ఇలాంటి విలువైన స్టేట్ మెంట్లు పురంధేశ్వరి నోటి నుంచి తప్ప మరెవరి నోటి నుంచి రావేమో. పార్టీ అధినాయకత్వానికి విధేయతగా ఉండటం తప్పేం కాదు. కానీ.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రజల ప్రయోజనాలు దెబ్బ తీసే నిర్ణయాలపై కనీస విమర్శలు చేయని పురంధేశ్వరి లాంటి నేతల అవసరం ఏపీకి ఉందంటారా? అన్న విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజా బడ్జెట్లలో ఏపీకి ఎలాంటి అన్యాయం జరగలేదని ఓపెన్ గా చెబుతున్న పురంధేశ్వరి లాంటి నేతల గురించి ఏపీ ప్రజలు కాస్త లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News