టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు: బయటపడ్డ ఆడియో లీక్

Update: 2022-10-28 09:15 GMT
తెలంగాణలో సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి స్వామి, నందకుమార్ లు మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీకైంది. ఈ ఆడియో కాల్ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో తమ మీద కేసీఆర్ నిఘా పెట్టారని.. మనం కలవడానికి హైదరాబాద్ మంచి ప్లేసు అని రోహిత్ రెడ్డి చెప్పగా.. నవంబర్ 25 తర్వాత తాను హైదరాబాద్ కు వస్తానని.. ఆరోజు కూర్చొని ఫైనల్ సెటిల్ మెంట్ చేసుకుందామంటూ రామచంద్రభారతి స్వామిజీ చెప్పినట్లు ఆడియో కాల్ లో ఉంది.

మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఈడీ నుంచి ఐటీ వరకూ తాము చూసుకుంటామని.. భద్రతపరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ రోహిత్ రెడ్డికి స్వామీజీ హామీ ఇచ్చారు. ఇంకా ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ వస్తారంటూ స్వామిజీ చెప్పినట్లు ఉంది.

ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. కానీ ఆ ఎమ్మెల్యేల పేర్లను తాను బయటపెట్టనంటూ రోహిత్ రెడ్డి ఆ ఆడియోలో అనడం గమనార్హం. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నందకుమార్ పై తాము ఒత్తిడి పెట్టడంతోనే అతడు రోజూ మీకు కాల్ చేస్తున్నాడంటూ స్వామిజీ చెప్పినట్లు ఆడియోలో ఉంది.ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలని రోహిత్ రెడ్డిని కోరాడు. తాము ఎవరికీ చెప్పమని.. కేసీఆర్ కు తెలిస్తే మా పని అయిపోతుందంటూ రోహిత్ రెడ్డి బదులిచ్చాడు. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రప్రభుత్వం మా చేతుల్లో ఉందంటూ స్వామీజీ భరోసా ఇవ్వడం ఆడియోలో వినిపించింది.

ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీఎల్ సంతోష్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటారని.. 25న గ్రహణం ఉంది కాబట్టి ఆ తర్వాత కలుద్దాం.. నేను డైరెక్ట్ గా బీఎల్ సంతోష్ తోనే మాట్లాడుతా.. నాకు మధ్యవర్తులూ ఎవరూ లేరు అంటూ రామచంద్రభారతి చెప్పగా.. స్వామీజీ మీరు క్లారిటీ తీసుకోండి.. నేను మరికొంతమంది కోసం ప్రయత్నిస్తానని రోహిత్ రెడ్డి సమాధానమిచ్చారు.

ఎవరు ముందు వస్తే వారికే ప్రాధాన్యత ఉంటుందని మీకు సిస్టం గురించి అన్నీ తెలుసని.. వస్తే మిమ్మల్ని ప్రమోట్ చేస్తామని మునుగోడు ఎన్నికల కంటే ముందు మనం ముందుకు పోతే దాని ప్రభావం వేరే విధంగా ఉంటుందని.. మేము మా వ్యవస్థలోకి మంచి లీడర్లు రావాలని కోరుకుంటున్నామని.. చాలా పై స్థాయి నుంచి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఉందని రామచంద్రభారతి చెప్పినట్లు ఆడియోలో ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News