అద్వానీ నోరిప్పారు!...అంత‌రంగం ఆవిష్క‌ర‌ణ‌!

Update: 2019-04-05 04:28 GMT
లాల్ కృష్ణ అద్వానీ... ఎల్కే అద్వానీగా దేశ ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం ప‌రిచయం అక్క‌ర్లేని పేరే. దేశానికి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని అహ‌ర‌హం శ్ర‌మించిన నేత‌గా అద్వానీ మ‌న క‌ళ్ల ముందు క‌ద‌లాడ‌తారు. బీజేపీని రెండు సీట్లు క‌లిగిన పార్టీ నుంచి ఏకంగా కేంద్రంలో అధికారం చేప‌ట్టే దాకా బ‌లోపేతం చేసిన రాజ‌కీయ యోధుడు కూడా. అయితే త‌న కృషితో పార్టీని అయితే అత్యంత శ‌క్తివంత‌మైన పార్టీగానే తీర్చిదిద్దారు గానీ.. తాను మాత్రం ప్ర‌ధాని కాలేక‌పోయారు. ప్ర‌ధాని కాలేక‌పోయిన సమ‌యంలోనూ ఆయ‌న పెద్ద‌గా బాధ ప‌డ‌లేదు గానీ... పార్టీలో త‌న‌ను ఉన్న‌ప‌ళంగా కింద ప‌డేసిన తీరుతో మాత్రం ఆయ‌న బాగానే నొచ్చుకున్నారు. గుజ‌రాత్ సీఎంగా ఉన్న న‌రేంద్ర మోదీ ఎప్పుడైతే... బీజేపీ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారో... అప్పుడే అద్వానీ శ‌కం ముగిసిన‌ట్టేన‌న్న వాద‌న వినిపించింది. అయితే అప్ప‌టిక‌ప్పుడు అంత‌టి పెద్ద నేత‌ను ప‌క్క‌న‌పెడితే... ఎక్క‌డ కొంప మునుగుతుందోన‌న్న భ‌యంతో క‌మ‌ల‌నాథులు కొంత‌మేర ఆయ‌నకు ప్రాధాన్యం ఇచ్చినా.. ఇప్పుడు ఆయ‌న‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశార‌నే చెప్పాలి.

మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ లోని గాంధీ న‌గ‌ర్ నుంచి ఏకంగా వ‌రుస‌బెట్టి ఆరు ప‌ర్యాయాలు ఎంపీగా గెలిచిన అద్వానీకి ఈ ద‌ఫా బీజేపీ టికెట్ ద‌క్క‌లేదు. అద్వానీ స్థానంలో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఇప్ప‌టికే నామినేష‌న్ వేసేశారు. ఈ ప‌రిణామంతో బీజేపీలో త‌న శ‌కం ముగిసింద‌న్న భావ‌న‌కు అద్వానీ వ‌చ్చేశారు. అస్త్ర‌స‌న్యాసం చేయ‌క త‌ప్ప‌డం లేద‌న్న భావ‌న‌కు వ‌చ్చేశారు. అంతే... ఏమాత్రం ఆలోచించ‌కుండా... బీజేపీ ఆవిర్భావ దినోత్స‌వానికి కాస్తంత ముందుగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు. తొలుత దేశం, త‌ర్వాత పార్టీ, చివ‌ర‌లో కాస్తంత సొంత ప్ర‌యోజ‌నాలు అంటూ అద్వానీ త‌న బ్లాగ్ లో అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు. అద్వానీ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిపోయాయి. ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అద్వానీ త‌న అస్త్ర స‌న్యాసాన్ని ప్ర‌క‌టిస్తూ... ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న‌ను ఆరు ప‌ర్యాయాలు పార్ల‌మెంటుకు పంపిన గాంధీ న‌గ‌ర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించిన అద్వానీ... అందులో క్లుప్తంగానే అయినా చాలా అంశాల‌నే ప్ర‌స్తావించారు.

ఈ బ్లాగ్ పోస్ట్ లో అద్వానీ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *గాంధీనగర్ ప్రజలకు కృతజతలు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారు. నియోజకవర్గ ప్రజల ప్రేమ, మద్దతు సంతోషాన్నిచ్చిందది. ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. ఇది బీజేపీ శ్రేణులకు ముఖ్యమైన రోజు, ఆత్మపరిశీలనతోపాటు గత జ్ఞాపకాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా దేశ ప్రజలతో పాటు కోట్లాది మంది బీజేపీ శ్రేణులతో అభిప్రాయాలను పంచుకోవాలని భావిస్తున్నా. 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆరెస్సెస్‌లో చేరా. అప్పటినుంచి దేశం కోసం సేవ చేయడం అలవాటుగా మారింది. రాజకీయ జీవితంలో జన సంఘ్, బీజేపీతో ఏడు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధం ఉంది. ఫస్ట్ భారతీయ జనసంఘ్, తర్వాత బీజేపీ ఏర్పాటు చేశాం. రెండింటిలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్ పేయితోపాటు పలువురు స్పూర్తిదాయక నేతలతో పనిచేసే గొప్ప అవకాశం లభించింది. తొలుత దేశం, తర్వాత పార్టీ, చివర సొంత ప్రయోజనాలు అనే స్పూర్తిదాయక సూత్రాన్ని జీవితంలో అన్ని పరిస్థితుల్లో పాటించా. అలాగే రాజకీయంగా విభేదించేవారిని ఎప్పుడూ శత్రువులుగా చూడలేదు. బీజేపీ భావ భారత జాతీయవాదం మాత్రమే. రాజకీయంగా విభేదించే వారిని ఎన్నడూ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించలేదు. ప్రతి పౌరుడి స్వేచ్చకు పార్టీ నిబద్దతతో కట్టుబడి ఉంది. రాజకీయంగా కూడా ఇదే విధానం అవలంభించాం. మీడియా సహా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలి* అని అద్వానీ అందులో పేర్కొన్నారు.
    

Tags:    

Similar News