పదిమందిని కనండి.. 'మదర్ హీరోయిన్' అయిపోండి..: పుతిన్

Update: 2022-08-18 12:31 GMT
రష్యా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. అమెరికా, చైనా కలిపితే ఎంతనో ఒక్క రష్యానే అంత విస్తీర్ణంలో ఉంటుంది. అంతెందుకు.. ఉత్తర అమెరికా ఖండం మొత్తం కలిపితే.. ఒక్క రష్యా అంత. ఇంకా చెప్పాలంటే.. ఐదు భారత దేశాలు కలిపితే ఒక రష్యా. అది కూడా.. ప్రస్తుతం ఉన్న రష్యానే. 30 ఏళ్ల కిందట విడిపోయిన యూఎస్ఎస్ఆర్ (యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రష్యా) విస్తీర్ణం అయితే ఇంకా చాలా. వాస్తవానికి యూఎస్ఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయినవే ఉక్రెయిన్, జార్జియా, కజకిస్తాన్, తుర్క్మెనిస్థాన్ తదితరాలు. ఇంకా చెప్పాలంటే.. ఈ దేశాల్లో కొన్ని దాదాపు భారత దేశం అంత ఉంటాయి.

దేశం పెద్దదే.. ఎక్కువగా చలి ప్రాంతం

రష్యా విస్తీర్ణం 1.72 లక్షల చదరపు కిలోమీటర్లు. అయితే.. ఇందులో ఉత్తర ప్రాంతమైన సైబీరియాలో చాలా చలి. అక్కడి యక్తక్ నగరం ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతే -50 డిగ్రీలు. ఇదే ప్రాంతంలోని ఒమ్యకోన్ లో అయితే.. 1933లో -67 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఇప్పటి రష్యా విషయానికొస్తే.. అక్కడి జనాభా దాదాపు 15 కోట్లు.

అంత పెద్ద దేశంలో ఇది చాలా తక్కువన్నట్లే. ఇందులోనూ ఓ 15 వేల మంది ఇటీవల ఉక్రెయిన్ యుద్ధంలోనే మరణించారు. ఇక కొవిడ్ తో అధికారికంగానే రష్యాలో 4 లక్షల మంది చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువే ఉంటుంది. వయోధికుల సంగతి వదిలేస్తే రష్యా మున్ముందు జనాభా కొరత ఎదుర్కొననుందని తెలుస్తోంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌.. జనాభాను పెంచేందుకు సిద్ధమయ్యారు. పూర్వ సోవియట్ కాలంలోని ఓ అవార్డును మళ్లీ తెరపైకి తెచ్చారు.

10 మంది పిల్లలకు రూ.13 లక్షలు

సోవియట్ కాలంలోని ఈ అవార్డు పేరు 'మదర్ హీరోయిన్'. ఇది కుటుంబాలను విస్తరించేందుకు ప్రోత్సాహకంగా ప్రవేశపెట్టిన పథకం. దీనిప్రకారం.. 10, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే ఆ తల్లులకు డబ్బులిస్తారు. దీనిని మూడు రోజుల కిందట పునరుద్ధరించారు. మదర్ హీరోయిన్ గా గుర్తించి రూ.13 లక్షలు (మిలియన్ రూబుల్స్) ఇస్తారు. వాయిదాలేమీ లేకుండా ఒకేసారి దీనిని చెల్లిస్తారు. అయితే, ఈ చెల్లింపు పదో బిడ్డ మొదటి పుట్టిన రోజున ఇస్తారు. అంతేకాక.. మిగతా తొమ్మిది మంది కూడా జీవించి ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది.

స్టాలిన్ హయాం నాటి పథకం ఇది

మదర్ హీరోయిన్ పథకం దివంగత నాయకుడు జోసెఫ్ స్టాలిన్ హయాం నాటిది. దీనిని 1944లో ప్రవేశపెట్టారు. అప్పట్లో దీన్ని యూఎస్ఎస్ఆర్ గౌరవ పురస్కారంగా పేర్కొనేవారు. మొత్తమ్మీద 4 లక్షల మందికి ఈ అవార్డు అందజేశారు. కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రాణ నష్టం నేపథ్యంలో జనాభా పెంచడం కోసం పుతిన్‌ ఈ అవార్డును మళ్లీ తెచ్చినట్లు తెలుస్తోంది.

జపాన్ చైనాలదీ ఇదే తీరు

పిల్లల గురించి.. ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అంటూ చైనా ముప్పై ఏళ్ల కిందట తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. ఇప్పుడు తీవ్ర జనాభా కొరత ఎదుర్కొంటోంది. ఇక జపాన్ వయోధికులు అధికంగా ఉండడంతో జనాభా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి జనాభా నియంత్రణపై పద్ధతి లేకుంటే ఎంత ఇబ్బందో వీటి ద్వారా తెలుస్తోంది. ఇక రష్యా విషయానికొస్తే గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతున్నట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. కానీ, ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా తీవ్రంగా దెబ్బతిన్నది. కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఆర్థికంగా కోలుకుంటోందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో మిలియన్‌ రూబుల్స్‌ కోసం 10 మంది పిల్లల్ని కని.. వారిని కంటికి రెప్పలా పెంచడం సాధ్యమేనా అంటే.. చెప్పలేని పరిస్థితి. ఇక.. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందో..?
Tags:    

Similar News