పుతిన్‌ 'ప్లాన్‌-బి'..! అందుకే మరియపోల్ పై గురి

Update: 2022-03-22 15:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించి నెల అవుతోంది. కానీ, కనీసం రాజధాని కీవ్ ను కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది. మరోవైపు భారీగా ప్రాణ, ఆయుధ నష్టాన్ని ఎదుర్కొంటోంది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఏమీ పాలుపోని పరిస్థితి. మరోవైపు పాశ్చాత్య దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఆర్థికంగానూ దెబ్బతినే పరిస్థితి. దీంతో ఏంటి పరిస్థితి..? పుతిన్ లక్ష్యం ఏమిటి? తదుపరి ఏంచేయబోతున్నారు? ఇప్పుడు మరియపోల్ ను లక్ష్యంగా ఎందుకు ఎంచుకున్నారు? ఆ నగరంపై ఎందుకు విరిచుకుపడుతున్నారు? ఆయన ప్లాన్ బి లో ఉన్నారా? అవుననే అనిపిస్తోంది.

ఎదురుదెబ్బలు తగిలేకొద్దీ రష్యా వ్యూహాలు, లక్ష్యాలు వేగంగా మారుతున్నాయి. మరియపోల్‌పై రష్యా నిర్దాక్షిణ్యంగా చేస్తున్న దాడులు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. శరవేగంగా కీవ్‌ను స్వాధీనం చేసుకొని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాలనే మాస్కో వ్యూహం ఫలించలేదు. కీవ్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన రావడం.. భారీగా సైనికులను కోల్పోవడంతో ఇప్పుడు క్రెమ్లిన్‌ మెల్లగా వ్యూహాన్ని మార్చుకొంటోంది. ఇప్పటికే ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను సుస్థిరం చేసుకోవడంతోపాటు.. అనుసంధానత పెంచుకోవడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల మేరియుపోల్‌ను లొంగిపొమ్మని భారీగా దాడులు మొదలుపెట్టింది.

కీవ్ వశపడక..
రష్యాకు ఇన్ని రోజుల్లో పెద్ద ఎదురుదెబ్బ కీవ్ ను స్వాధీనం చేసుకోలేకపోవడం. కీవ్.. రష్యాకు బలమైన మద్దతుదారైన బెలారస్‌ నుంచి పదుల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. యుద్ధం.. మొదలుతోనే కీవ్ వశపడిపోతుందని భావించింది. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. పైగా 14 వేల మందిపైగా రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ అంటోంది. రష్యా దళాలు తమ మౌలిక సదుపాయాలు వాడుకోకుండా ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. వంతెనలు, విమానాశ్రయాల్లో లెక్కలేనన్ని ల్యాండ్‌మైన్లు పాతిపెట్టారు. రష్యా దళాలు వీటిని వాడుకోవడం అసాధ్యంగా మారింది. యుద్ధం ముగిశాక కూడా వీటిని తొలగించాలంటే కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా. మరోపక్క ఆంక్షలు
తీవ్రం కావడంతో మిత్రదేశాలు రష్యాకు దూరంగా జరుగుతున్న పరిస్థితి. దీంతో పుతిన్‌ ప్లాన్‌-బిపై దృష్టిపెట్టినట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం బైడెన్‌ కార్యకవర్గంలో కీలక అధికారులు చెబుతున్నారు.

ఆ ప్రాంతాలు చాలనుకుంటోందా?
రష్యా.. 2014లో ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను కలిపేసుకుంది. డాన్‌బాస్‌లోని ప్రాంతాలపై పట్టు సాధించింది. ఇప్పుడు వీటిపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని కీవ్‌ను కోరుతోంది. అసలు.. రష్యా యుద్ధం మొదలుపెట్టింది ఉక్రెయిన్ నాటో, యూరోపియన్ యూనియన్ లలో చేరకూడదని. కానీ ,ఇప్పుడు పట్టు సడలించి పునరాలోచనలో పడింది. కొత్త డిమాండ్లను కీవ్‌ అంగీకరిస్తే క్రిమియా-డాన్‌బాస్‌ ప్రాంతానికి-రష్యాకు భూ అనుసంధానత లభిస్తుంది. తద్వరా రష్యా ఫీల్డ్ లో మరింత బలోపేతమై డాన్‌బాస్‌పై ఆధిపత్యం చేయగలదు. అయితే, ఇతర నగరాలపై సైనిక దాడుల తీవ్రతను వ్యూహాత్మకంగా పెంచుతూనేంది. పశ్చిమ దేశాల కూటమిలో చేరే ఆలోచనను ఉక్రెయిన్‌ విడిచిపెట్టేలా అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఒప్పించాలన్నది లక్ష్యం. దీంతోపాటు దానిని తటస్థ దేశంగా ఉంచడంతోపాటు రష్యా డిమాండ్లను సాధించవచ్చు.

అంటే భూభాగాలను సాధించడంతోపాటు.. భద్రతా పరమైన ఒప్పందాలు కూడా అంగీకరింపజేయవచ్చు. ఈ డిమాండ్లకూ అంగీకరించకపోతే ఇప్పటికే దళాలు ఆక్రమించుకొన్న భూభాగాలను రష్యా వదిలిపెట్టకుండా నగరాలను ముట్టడించే అవకాశం ఉంది. తరచూ క్షిపణి దాడులు చేయొచ్చు. ఒక వేళ రష్యా బలగాలు వేగంగా విజయాలు సాధిస్తుంటే మాత్రం పుతిన్‌ లక్ష్యాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది. క్రిమియా నుంచి డాన్‌బాస్‌ ప్రాంతం మీదుగా పశ్చిమ రష్యాను కలిపే భూమార్గంలో మేరియుపోల్‌ పోర్టు సిటీ కీలకం. దీనిని ఆధీనంలోకి తీసుకోకుండా వ్యూహాత్మక లక్ష్యాలను సాధించే అవకాశం రష్యాకు లభించదు.

ఈ నగరాన్ని స్వాధీనం చేసుకొంటే రణరంగంలో రష్యా అతిపెద్ద విజయం సాధించినట్లవుతుంది. అందుకే ఈ నగరంపై విరుచుకుపడుతోంది. అందుకే ఇప్పటి వరకు ఉక్రెయిన్‌తో జరిగిన చర్చలకు తక్కువస్థాయి బృందాలను మాత్రమే రష్యా పంపింది.బేరసారాలకు అవసరమైన భూభాగాలను చేజిక్కించుకొన్నాక.. ఉక్రెయిన్‌ను బలవంతంగా చర్చల వేదికపైకి తెచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పశ్చిమ దేశాల నుంచి మినహాయింపులు పొందడానికి కూడా ఇవి ఉపయగపడతాయన్నది పుతిన్‌ వ్యూహం.
Tags:    

Similar News