మంత్రిని విమ‌ర్శిస్తే...నోటికి కుట్లేస్తాం

Update: 2016-09-18 06:01 GMT
ప్ర‌జాస్వామ్యంలో విమ‌ర్శ‌లు-ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మే. కానీ త‌మ పార్టీకి చెందిన జిల్లా మంత్రిని దుయ్య‌బట్టార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని ఘాటుగా హెచ్చ‌రించారు మంథని టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే పుట్ట మధు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ను క‌రీంన‌గ‌ర్ జిల్లా  టీడీపీ అధ్యక్షుడు విజయ రమణారావు విమ‌ర్శించినందుకు అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే మ‌ధు ఈ స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన టీడీపీలో ఉంటూ కరీంనగర్‌ జ్యోతిరావుపూలేగా పేరొందిన ఈటెల రాజేంద‌ర్‌ పై  విమర్శలు చేయడం సరికాదని పుట్ట‌మ‌ధు తెలిపారు. మరోమారు నోరుపారేసుకుంటే మూతికి కుట్లు వేస్తామని హెచ్చ‌రించారు. పేదలపక్షాన నిలబడి అనేక అభివృద్ది పనులకు నిధులు సమకూర్చుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లా ప్రజలకు దేవుడని మ‌ధు తెలిపారు. ప్రభుత్వంలో ఎంతో కీలకమైన పదవులు నిర్వహిస్తున్న ఈట‌ల జిల్లా సంక్షేమం కోసం ఎన్నో ప‌నులు చేశార‌ని వివ‌రించారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో విజ‌య‌ర‌మ‌ణారావు కాంగ్రెస్‌ నాయకుల మోచేతుల నీళ్లు తాగి నియోజ‌క‌వ‌ర్గానికి ద్రోహం చేశార‌ని పుట్ట మ‌ధు మండిప‌డ్డారు. టీడీపీ ఎమ్మెల్యే హ‌యాంలో పెద్దపల్లి ప్రజలు పాడుబ‌డ్డ‌ బావి నీరు మాత్రమే తాగేవారని నేడు మంత్రి ఈట‌ల చొరవతో పెద్దపల్లికి గోదావరి నది నీళ్లు మంచినీళ్లుగా వస్తున్నాయని తెలిపారు. బీసీ నాయకుడిగా ఎదిగిన ఈటల రాజేందర్‌ ను విమర్శిస్తే బీసీలను విమర్శించినట్లుగా ప్రజలు భావిస్తారని  మ‌ధు అన్నారు. ఇప్పటికైన విజయ రమణరావు తన వైఖరిని, నోట దురుసు త‌నాన్ని మార్చుకోకుంటే టీఆర్‌ ఎస్‌ శ్రేణులతో పాటు బీసీలు తగిన గుణపాఠం చెపుతారని మ‌ధు హెచ్చ‌రించారు.
Tags:    

Similar News