సాగ‌ర స‌మ‌రం.. రేవంత్‌ను ఎందుకు ప‌క్క‌న పెట్టారు?

Update: 2021-04-11 13:30 GMT
తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా ఉన్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో గెలిచి త‌న స‌త్తా చాటుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఓడిపోయిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జానా రెడ్డికి మ‌ళ్లీ టికెట్ ఇచ్చారు. ప్ర‌జ‌ల్లో ఉన్న సింప‌తీని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై గ‌ట్టివాయిస్ వినిపించేందుకు, ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై పంచ్‌లు పేల్చే యువ నాయ‌కుడు రేవంత్ రెడ్డిని ప‌క్క‌న పెట్ట‌డం.. ఏదో మొక్కుబడిగా ఆయ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

గ‌తంలో టీడీపీలో ఉన్న నాటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నంత వ‌ర‌కు కూడా రేవంత్ రెడ్డి దూకుడు చాలా డిఫ‌రెంట్‌. ఈ విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. ముఖ్యంగా యూత్ ఐకాన్‌గా ఆయన‌కు ప్ర‌త్య‌క గుర్తింపు ఉంది. దీంతో ఆయ‌న‌ను సాగ‌ర్‌లో ప్ర‌చారానికి భారీ ఎత్తున వాడుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ వాదులు పెద్ద‌గా రేవంత్‌ను వాడుకోవ‌డం లేదు. ఆయ‌న‌కు ఇటీవ‌ల క‌రోనా వ‌చ్చిన త‌ర్వాతదూరంగా ఉంటున్నారు.కానీ, కాంగ్రెస్‌లోని యూత్ నుంచి రేవంత్ ను రంగంలోకి దింపాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

ముఖ్యంగా సాగ‌ర్‌లో టీఆర్ ఎస్‌కు బ‌లైమ‌న మండ‌లాలున్న ప్రాంతాల్లో రేవంత్‌ను రంగంలోకి దింపితే.. గ‌ట్టి ఫ‌లితం ఉంటుంద‌ని యూత్ భావిస్తున్నారు. దీంతో రేవంత్‌ను ఎలాగైనా రంగంలోకి దింపాల‌నే ఒత్తిడి వ‌స్తోంది. కానీ, సీనియ‌ర్లు మాత్రం ఆయ‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం హైక‌మాండ్ చెప్పింది క‌నుక‌.. అన్న విధంగా రేవంత్‌తో ట‌చ్‌లో ఉంటున్నార‌ని.. ఆయ‌న‌తో మొక్కుబ‌డిగానే ప్ర‌చారం చేయిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మాటల మాంత్రికుడు కేసీఆర్‌కు దీటుగా మాట్లాడే నాయ‌కుడు కాంగ్రెస్‌లో లేరు. పైగా ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో కేసీఆర్‌తో త‌ల‌ప‌డే నాయ‌కుడు కూడా రేవంత్ త‌ర్వాత ఎవ‌రూ లేరు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను సాగ‌ర స‌మ‌రంలో ముందుంచితే ఫ‌లితం ఆశించిన విధంగానే ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. దీనికి కాంగ్రెస్ హైక‌మాండ్ ద‌గ్గ‌ర స‌మాధానం లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా రేవంత్ వంటి దూకుడు, మంచి వాక్చాతుర్యం ఉన్న నాయ‌కుడిని స‌రైన విధంగా సాగ‌ర్‌లో వాడుకోవ‌డం లేద‌నేది వాస్త‌వ‌మ‌ని.. మ‌రి ఇలా అయితే.. కాంగ్రెస్ ఎలా విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.





Tags:    

Similar News