అమ్మను ఇరుకున పెట్టిన పీవీ కుమార్తె

Update: 2015-04-08 12:32 GMT
చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోవాల్సిందే. అధికారంలోఉన్నప్పుడు చేసే తప్పుడు పనులకు తర్వాత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురు కాక తప్పదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మీద వ్యక్తిగతంగా ఉన్న కోపంతో ఆయన్ను ఎంతలా అవమానించాలో అంతలా అవమానించటమే కాదు.. చివరకు ఆయన సమాధిని ఢిల్లీలో ఉంచకుండా పంపేసి.. తాను తలుచుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని సోనియమ్మ తెలియజేసిన వైనం అందరికి తెలిసిందే.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితంలో ఎత్తుపల్లాలు మామూలే. అందులోకి రాజకీయ నేతల జీవితాల్లో ఈ ఎత్తుపల్లాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వరుస పరాజయాలతో పాటు.. నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడున్నంత గడ్డు పరిస్థితి గతంలో ఎదుర్కొనలేదని చెబుతారు. అమ్మకేమో వయసు మీదకొచ్చింది. అనారోగ్యం తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.

పట్టాభిషేకం చేసి కొడుక్కి పార్టీని అప్పజెబుదామంటే..సెలవు తీసుకొని వెళ్లి ఇప్పటివరకూ పత్తా లేకుండా పోయిన పరిస్థితి. తిరిగి వచ్చిన తర్వాతైనా బుద్ధిగా ఉంటాడా? అన్నది పెద్ద ప్రశ్న. ఇలాంటి సమయంలోనే.. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం అమ్మను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. తనకు ఏమాత్రం నచ్చని పీవీకి సంబంధించిన స్మారక చిహ్నం ఒకటి భారీగా ఢిల్లీలో ఏర్పాటు చేయాలని మోడీ తీసుకున్న నిర్ణయం అమ్మను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా పీవీ కుమార్తె వాణి నోరు విప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో తన తండ్రికి జరిగిన అవమానాన్ని ఆమె వెల్లడించారు. తన తండ్రి మరణించినప్పుడు.. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ తీసుకెళ్లాలని తమపై ఒత్తిడి చేశారని.. తమకు బాగా తెలిసిన నాటి మంత్రి శివరాజ్‌ పాటిల్‌తో చెప్పించారన్నారు. ఆయనే భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారన్నారు. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమకు భరోసా ఇచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.అందరు ప్రధానులకు ఢిల్లీలో స్మారక చిహ్నాలు ఉన్నా.. పీవీకి ఎందుకు లేదని ప్రశ్నించిన ఆమె.. పార్టీ నాయకత్వం అలా ఎందుకు వ్యవహరించిందో చెప్పాలన్నారు.తన తండ్రి పీవీకి ప్రధాని మోడీ సర్కారు గుర్తింపు ఇవ్వటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. నాడు వ్యక్తిగత కోపంతో భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపితే.. తాజాగా రాజకీయంలో భాగంగా పీవీ స్మృతిని ఢిల్లీకి తీసుకురావటం ద్వారా సోనియమ్మకు సరికొత్త చికాకును తెచ్చారనే వాదన వినిపిస్తోంది.



Tags:    

Similar News