ఒలింపిక్ లో భారత్ కు మరో పతకం.. మనమ్మాయ్ పుణ్యమే బాస్

Update: 2021-08-01 15:47 GMT
స్వర్ణం ఖాయమని ఫిక్స్ అయితే.. సెమీస్ లో ఓటమిపాలై షాకిచ్చిన తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఎట్టకేలకు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్ పట్టికలో భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చింది. సెమీస్ లో అనూహ్య పరాజయానికి గురైన సింధు కారణంగా ఒక్కసారిగా నిరాశ వ్యక్తమైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో స్వర్ణం సాధిస్తుందన్న అంచనాలు వ్యక్తం కావటం తెలిసిందే. మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్ లో సింధు విజయం సాధించటంతో క్రీడాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో మూడోస్థానం కోసం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస గేమ్స్ లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన ఆమె.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 21-13, 21-15 తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం లభించినట్లైంది.

మొదటి సెట్ ను సునాయసంగా గెలుపొందిన సింధు.. రెండో సెట్ ను సొంతం చేసుకోవటానికి కాస్తంత కష్టపడాల్సి వచ్చింది. అయితే.. సింధు మీద చైనా క్రీడాకారిణి ఏ సమయంలోనూ అధిక్యత ప్రదర్శించలేదు. తన తొలి మ్యాచ్ నుంచి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న సింధు.. అనూహ్యంగా సెమీస్ లో మాత్రం తన ప్రత్యర్థి మైండ్ గేమ్ కు తడబాటుకు గురైంది. ఆ మ్యాచ్లో సింధు దూకుడుగా ఆడితే.. ఆమె ప్రత్యర్థి మాత్రం తెలివైన ఆట ఆడటం.. సింధును అసహనానికి గురి చేయటం తెలిసిందే. గత మ్యాచ్ లో జరిగిన తప్పుల్ని రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న సింధు.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.

2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధు.. తాజాగా మాత్రం కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా గెలుపుతో.. వరుస ఒలింపిక్స్ లో రెండుసార్లు పతకాలు సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఆమె అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. సింధు రికార్డును బ్రేక్ చేసే వారెవరో?
Tags:    

Similar News