మంత్రి పదవే ముద్దంటున్న మాణిక్యం

Update: 2016-04-22 06:04 GMT
బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడు ఎవరన్న విషయంలో చాలాకాలంగా సందిగ్థత ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబును కొనసాగించాలని ఒక వర్గం.... సోము వీర్రాజుకు అవకాశమివ్వాలని ఇంకో వర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే... తాజాగా ఆ పార్ఠీ అధిష్ఠానం వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా మరో పేరును పరిశీలించింది. అది ఎవరో కాదు... ఏపీ కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు పేరు. ఆయన ఊ అంటే అధ్యక్షపదవి కట్టబెట్టాలనుకున్నారట. అయితే... నిర్ణయం వెలువరించే ముందు ఆయన్నో మాట అడగడం బెటరన్న ఉద్దేశంతో మాణిక్యాలరావును అధిష్ఠానం సంప్రదించగా ఆయన నో చెప్పారట. తనకు మంత్రి పదవ కావాలని.. తాను మంత్రి పదవిలోనే ఉంటానని చెప్పారట. అంతేకాదు, అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని కూడా ఆయన కుండబద్ధలు గొట్టి చెప్పేశారట. దీంతో మళ్లీ ఆ పదవి హరిబాబు - వీర్రాజుల మధ్యే దోబూచులాడుతోంది.

అలా అని వేరే ఎవరికైనా ఇద్దామన్నా సమర్థులైన నేతలు కనిపించడం లేదు. కన్నా - పురంధేశ్వరి - కావూరి వంటి సీనియర్లు ఉణ్నా వారంతా ఇతర పార్టీల నుంచి ఇటీవలే వచ్చిన నేతలు. రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేరును కూడా కొందరు ప్రతిపాదించారు కానీ, ఆయన కూడా పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతే కావడంతో అవకాశాలు తక్కువే. ఇక మంత్రి కామినేని శ్రీనివాస్ పేరును పరిశీలించడానికి కూడా అధిష్ఠానం సుముఖంగా లేదట. ఆయన బీజేపీ నేతలా కాకుండా టీడీపీ నేతలా వ్యవహరిస్తున్నారని.. సీఎం చంద్రబాబుకు తోకలా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధిష్ఠానానికి బోలెడంత ఫీడ్ బ్యాక్ రావడంతో కామినేని పేరును పరిశీలించలేదు. అయితే... ఇప్పటికే ఆలస్యం కావడంతో మరో వారం రోజుల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
Tags:    

Similar News