ఇంటి మీద కక్కుర్తికి.. భలే శాస్తి చేశారుగా?

Update: 2020-03-27 01:30 GMT
మీకు కోపం రావొచ్చు. కానీ.. కరోనావేళ.. ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవు. ఒక్కడు చేసే తప్పు వందలాది మంది ప్రాణాలకు ముప్పుగా మారేవేళలో.. అలాంటి వాటిని మొహమాటం లేకుండా అణిచివేయాల్సిన అవసరం ఉంది. తాజాగా ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం అలాంటిదే. హైదరాబాద్ లో ఉంటూ.. సౌకర్యాలకు కొదవ లేకున్నా.. హాస్టళ్ల వారు ఖాళీ చేయమన్నారన్న కారణాన్ని భూతద్దంలో చూపించి.. అమ్మా, నాన్న.. అక్కా, తమ్ముడు.. బాబాయ్, పిన్ని.. మామయ్య, అత్తయ్య పేర్లు.. చెప్పి తమకు తప్పించి మరెవరికి ఇబ్బందులు లేవన్నట్లుగా చెబుతూ.. ఊళ్లకు వెళ్లేందుకు చూపించిన ఆసక్తి అంతా ఇంతా కాదు.

అన్ని బాగున్న రోజుల్లో ఊరికి వెళ్లేందుకు.. ఆఫీసు.. సెలవులు..ఇలాంటి కారణాలు చూపించేవారు సైతం.. ఇప్పుడేమో ఊరు గుర్తుకు వస్తుంది. కారణం.. పెద్ద ఎత్తున సెలవులు వస్తున్నప్పుడు.. అయిన వారందరితో బిజీగా ఉండాలన్న కక్కుర్తే. ఇలా ఆలోచిస్తున్న వారంతా తాము చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయారు. తాము చేసే తప్పులకు తాము మాత్రమే కాదు.. తమ కుటుంబ సభ్యులు.. ఊరి వారుకూడా ఇబ్బంది పడతారన్న విషయాన్ని మర్చిపోయారు.

ఇంటి గదుల్లో.. హాస్టల్ రూముల్లో ఉండటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. అలాంటి వారంతా.. ఏదో కారణం చెప్పి పోలీసుల పర్మిషన్ తీసుకొని ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలాంటి వారందరికి ఊహించిన నిర్ణయంతో ఏపీ సర్కారు భారీ ట్విస్ట్ ఇచ్చేసింది. కరోనా వేళ.. ప్రయాణాలు అస్సలు పనికి రావని నెత్తినోరు కొట్టుకున్నా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏదోలా ఊరికి చేరిపోతే చాలన్న తమ కంఫర్ట్ కు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేసింది.

దీనికి తోడు.. ఇళ్లల్లో వారికి తెలిసి తెలియని తనం.. తమ పిల్లలు ఇంటికి రావాలన్న తపన తప్పించి.. వారి కారణంగా తమకు.. ఇతరులకు ముప్పు ఉందన్న విషయాన్ని మర్చిపోయి చెప్పిన మాటలకు ప్రభావితమైనందుకు జరగాల్సిన శాస్తి జరిగిందనే చెప్పాలి. ఇలా అనేస్తారా? అన్న కోపం మీకు రావొచ్చు. కానీ.. ఇక్కడ వ్యక్తులు.. వారి అభిరుచుల కంటే కూడా.. సమాజహితం చాలా అవసరం అన్నది మర్చిపోకూడదు. అది వదిలేసి.. ఊళ్లకు వేలం వెర్రిగా బయలుదేరిన వారందరిని.. ఏపీలోకి అనుమతించాలంటే వారు పద్నాలుగు రోజులు క్వారంటైన్ కు ఒప్పుకుంటామంటేనే ఓకే చేస్తామని చెప్పటం తో.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది.

అప్పటికే వాహనాల వారికి భారీ మొత్తాన్ని ముట్టజెప్పి తీసుకెళ్లగా.. అక్కడి పరిస్థితి చూసి.. మధ్యలో వదిలేసి కొందరు వెళ్లిపోయారు. ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. హాయిగా ఉన్న చోట ఉండి.. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో మీరున్న పరిధిలోని మూడు కిలోమీటర్ల దూరంలో ఏమైనా కావాలంటే కొనుక్కొని రావొచ్చన్న వెసులుబాటును ఉపయోగించుకోకుండా పరుగులు తీసిన దానికి జరగాల్సింది జరిగింది. ఊళ్లకు వెళ్లాలంటూ పరుగులు తీసి త్రిశంక స్వర్గంలో ఉన్న వారిని చూసినోళ్లంతా.. తామంతా వెళ్లనందుకు తెగ ఆనందించే పరిస్థితి. కరోనాలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని త్యాగాలు.. మరికొన్ని ఇబ్బందులు తప్పవు. వాటిని ఎవరికి వారు భరించాల్సిందే. కరోనాతో పోలిస్తే.. ఈ ఇబ్బందులు చాలా చిన్నవన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News