ప్ర‌త్యేక విమానాల ఖ‌ర్చు ఎవ‌రిదంటారు కేసీఆర్‌?

Update: 2018-05-01 05:04 GMT
నోరు తెరిస్తే చాలు నీతులు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల్లో ఉండే శ‌క్తి ఎంత‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న చెప్పే మాట‌ల‌న్ని న‌మ్మేసేలా ఉంటాయి. కంటి ముందు ఆయ‌న స‌ర్కారు ప‌ని తీరు క‌నిపిస్తున్నా.. ఆయ‌న మాట‌లు మంత్రాల మాదిరి మారి. ట్రాన్స్ లోకి తీసుకెళ్లే శ‌క్తి యుక్తి కేసీఆర్ సొంతం. నిజానికి అదే ఆయ‌న బ‌లంగా చెప్పాలి.

పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా బోలెడ‌న్ని మాట‌లు చెప్పిన కేసీఆర్‌.. తాము నోరు క‌ట్టుకొని ప‌ని చేస్తున్న‌ట్లు చెబుతారు. అవినీతిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కుండా తాము అనుక్ష‌ణం కావ‌లి కుక్క‌ల్లా ప‌ని చేస్తున్నామ‌న్న పెద్ద మాట‌ను ఆసువుగా చెప్పేస్తారు. అదెంత వ‌ర‌కు నిజం? అన్న‌ది చూస్తే.. ఎప్ప‌టిలానే కేసీఆర్ మాట‌ల‌కు చేత‌ల‌కు ఎక్క‌డా పొంత‌న క‌నిపించ‌దు.

ప్ర‌జాధ‌నాన్ని తాము కాపాడుతున్న‌ట్లుగా మ‌రెవ‌రూ ఉండ‌ర‌ని చెప్పే కేసీఆర్‌.. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతిని మాట వ‌ర‌స‌కు ప్ర‌స్తావించ‌టం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వంపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోప‌ణ‌ల్నిప‌క్కాన పెడితే.. ఇటీవ‌ల కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలిపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో గ‌డిచిన కొద్దికాలంగా కేసీఆర్ చెబుతున్న మాట‌లు..ఆయ‌న చేస్తున్న ఖ‌ర్చు ఎవ‌రి ఖాతాలోకి పోతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తో తెలంగాణ స‌ర్కారుకు కించిత్ సంబంధం లేదు. అలాంట‌ప్పుడు ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశానికి సంబంధించి చేస్తున్న ఖ‌ర్చు లెక్క‌లు ఏమిట‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆ మ‌ధ్య‌న వెళ్లిన కోల్ క‌తా.. త‌ర్వాత బెంగ‌ళూరు.. తాజాగా చెన్నైకి వెళ్లిన టూర్ల‌కు కేసీఆర్ ప్ర‌త్యేక విమానాన్ని వాడ‌టం తెలిసిందే. అంతేనా.. చెన్నైలోని చోళా షెర‌టాన్ లాంటి  విలాస‌వంత‌మైన హోట‌ల్లో బ‌స చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. చెన్నై టూర్ కే చూస్తే.. త‌న‌తో పాటు కేసీఆర్ భారీ ఎత్తున పార్టీ నేత‌ల్ని వెంట తీసుకెళుతున్నారు. ఇంత భారీ స్థాయిలో తీసుకెళుతున్న‌ మంది మార్బలానికి అయ్యే ఖ‌ర్చు మాటేమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. నైతిక‌త‌కు త‌న‌ను తాను బ్రాండ్ అంబాసిడ‌ర్ అన్న‌ట్లుగా మాట‌లు చెప్పే కేసీఆర్‌.. ఇటీవ‌ల కాలంలో జోరుగా వాడేస్తున్న ప్ర‌త్యేక విమానాల పేమెంట్ ఎలా చేస్తున్నారు?. ఇందులో టీఆర్ ఎస్ స‌ర్కారు మీద ప‌డుతున్న భారం ఎంత‌?  కేసీఆర్ వ్య‌క్తిగ‌తమైన ఫెడ‌ర‌ల్ టూర్ల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు ఎందుకు చెల్లించాలి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పేవారెవ‌రు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News