''ముదురు బేబీస్‌'' విమర్శ అదిరిందంటున్నారు

Update: 2015-07-10 04:56 GMT
ఉద్యమనాయకుడిగా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నేత ఆర్‌ కృష్ణయ్య. వెనుకబడిన కులాల హక్కుల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఆర్‌ కృష్ణయ్య నుంచి ఆయన అభిమానులు చాలానే ఆశించారు. ఆయనలాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే.. మరెన్ని పోరాటాలు చేస్తారో అని భావించారు.

కానీ.. అందుకు భిన్నంగా ఆయన నిశ్శబ్ధంగా ఉండటం.. తన పని తానుచేసుకుంటూ పోవటమే తప్పించి.. తన ఉద్యమ వైఖరిని ప్రదర్శించలేదు. అంతేకాదు.. తెలంగాణ అధికారపక్షంపై పెద్దగా విరుచుకుపడింది కూడా లేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ కృష్ణయ్య దూకుడుగా ఉండింది లేదు.

అలాంటి ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన మంత్రులపై కాస్తంత ఎటకారంగా విమర్శలు చేయటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏడాది బిడ్డంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ''నిజమే.. టీఆర్‌ఎస్‌ నేతలంతా ఏడాది బిడ్డలు. దశాబ్దాలుగా ఇతర పార్టీల్లో పదవులు అనుభవించిన నేటి టీఆర్‌ఎస్‌ నేతలంతా పసిగుడ్డులే. ఓ రకంగా వీరంతా ముదురు బేబీస్‌'' అంటూ ఎద్దేవా చేశారు.

ఇలా తెలంగాణ అధికారపక్షంపై కృష్ణయ్య గతంలో విరుచుకుపడింది లేదు. అంతేకాదు.. తెలంగాణ ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు సంధించిన కృష్ణయ్య.. తన కుటుంబ సభ్యులకు.. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ భాషలో మాట్లాడాలంటే సంస్కారం అడ్డు వస్తుందన్న కృష్ణయ్య నోటి వెంట ముదురు బేబీస్‌ లాంటి పంచ్‌లు మరిన్ని పడాలని కోరుకుంటున్నారు. కృష్ణయ్య నుంచి అలాంటి విమర్శలు వస్తాయా..?

Tags:    

Similar News