ఆర్‌.కృష్ణ‌య్య‌...కేరాఫ్ అయోమ‌యం

Update: 2018-11-17 08:48 GMT
ఆర్‌.కృష్ణ‌య్య ప్ర‌ముఖ బీసీ నాయ‌కుడు. ద‌శాబ్ద కాలంగా ఆయ‌న బీసీల స‌మ‌స్య‌ల ప‌ట్ల ఉద్య‌మిస్తున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఆయ‌న అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, అనంత‌రం ఆయ‌న్ను పార్టీ ప‌ట్టించుకోలేదు..పార్టీని ఆయ‌నా ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు...తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి లేని స్థితికి చేరిపోయిన నేప‌థ్యంలో...కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యారు ఆర్‌.కృష్ణ‌య్య‌. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలో దిగుతారనే అంచ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే, అలాంటి స్థితి నుంచి తాజాగా ఆయ‌న క్రాస్‌రోడ్స్‌లోకి చేరారు.

తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఆర్‌.కృష్ణ‌య్య‌ను త‌మ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. దానికి త‌గ్గ‌ట్లుగానే...కొన్ని మీడియా సంస్థ‌లు ఆయ‌న్ను `కొద్దికాలం`మోసేశాయి. ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం ఆయ‌న్ను క‌నీసం ఫ్లోర్‌లీడ‌ర్‌గా కూడా చేయ‌కుండా టీడీపీ పెద్ద‌లు త‌మ రాజ‌కీయం ప్ర‌ద‌ర్శించారు. ఇదిలాఉండ‌గా....ఆనాటి ప‌రిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరినా...ఆర్‌.కృష్ణ‌య్య పార్టీలోనే ఉన్నారు. అనంత‌రం ఆయన పార్టీ కార్య‌క్ర‌మాల్లో క్రియాశీలంగా పాల్గొన‌లేదు. `పార్టీ పెద్ద‌లు` కూడా ఆయ‌న్ను ఎన్నిక‌ల త‌ర్వాత లైట్ తీసుకున్నార‌నే టాక్ ఉంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యారనే టాక్ వ‌చ్చింది. ఇలా వివిధ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న స‌మ‌యంలోనే...ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చిప‌డ్డాయి.

ఈ ఎన్నిక‌ల్లో ఆర్‌.కృష్ణ‌య్య‌కు నిరాశ ఎదురైంద‌ని అంటున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆయ‌న‌కు టికెట్ కేటాయించ‌లేదు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ సైతం టికెట్ ఇవ్వ‌లేదు. ఈ బీసీ నాయ‌కుడు ఒక ద‌శ‌లో సొంత పార్టీ పెట్టేందుకు సైతం సిద్ధ‌మ‌యిన‌ప్ప‌టికీ అది మందుకు ప‌డ‌లేదు. దీంతో ఆర్.కృష్ణ‌య్య అయోమ‌యంలో ప‌డిపోయార‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.
    

Tags:    

Similar News