టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి ఏ పదవీ ఇవ్వలేదు

Update: 2015-10-01 09:47 GMT
మొన్నటి  ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన... ఆ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో అధికారంలోకి రాకపోవడంతో కృష్ణయ్య ముఖ్యమంత్రి కాలేకపోయారు... ఆ తరువాత పార్టీలోనూ క్రియాశీలంగా లేరు... ఆయన పార్టీని పట్టించుకోలేదు.. పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఆయన దారి ఆయనది... పార్టీ దారి పార్టీ.. మొన్నటి వరకు ఈ విషయంలో కొందరికి ఇంకా అంత క్లారిటీ లేకపోయినా తాజాగా టీడీపీ కమిటీల ఏర్పాటుతో ఆ విషయం స్పష్టంగా బయటపడిపోయింది. టీడీపీ జాతీయ కమిటీలో కానీ, తెలంగాణ కమిటీలో కానీ ఈ ముఖ్యమంత్రి కేండిడేట్ కు స్థానం దొరకలేదు. ఆయన కూడా అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడడం లేదు. బలమైన బీసీ ఉద్యమనేత హోదాలో టీడీపీ కండువా కప్పుకొని ఏకంగా ఆ పార్టీ సీఎం కేండిడేట్ గా నిలిచిన ఆయన ఇప్పుడు ఎటూకాకుండా పోయారు.

.. అయితే... ఇందులో టీడీపీ పాత్ర ఎంతుందో కృష్ణయ్య తీరూ అంతే కారణమవుతోంది. కృష్నయ్య తొలినుంచీ పార్టీ కార్యక్రమాల్లో అంతంతమాత్రంగా పాల్గొనేవారు. తన ప్రథమ ప్రాధాన్యం టీడీపీ కాదని, బీసీ ఉద్యమమని కూడా ఆయన అన్నారు. టీడీపీ లీడర్ గా కంటే బీసీ సంఘం జాతీయ నేతగా ఎదగడానికి ఆయన ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు.

... అయితే, టెక్నికల్ గా ఇంకా పార్టీలో ఉన్నా కృష్ణయ్యకు టీడీపీతో సంబంధాలు తెగిపోయాయి. తనకసలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని ఆయన అంటున్నారు. ప్రస్తుత సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలపై తాను డీటెయిల్డుగామాట్లాడడానికి రెడీ అయితే ఎర్రబెల్లి మొత్తం సమయం తినేసి తనకు ఛాన్సు రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తనకు అవకాశమివ్వడం లేదన్నది కృష్ణయ్య ఆరోపణ.. అయితే... పార్టీ కోసం పనిచేయని కృష్ణయ్యకు మైకు ఎందుకు ఇస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.  ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న హోదానే కాపాడుకోలేకపోయిన కృష్ణయ్య నిజంగా ముఖ్యమంత్రయితే ఈసరికి ఎలా ఉండేదో... టీడీపీకి ఎన్ని కష్టాలు వచ్చేవో.
Tags:    

Similar News