కేసీఆర్ కు ఫిటింగ్ పెట్టేశారు

Update: 2015-05-23 05:40 GMT
పేదలకు గూడు కోసం ఉస్మానియా యూనివర్సిటీ స్థలంలో ఇళ్లను కడతామని  ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ రచ్చకు తెరలేపిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తమ ఆవేదనను వెల్లగక్కుతున్నాయి. అయితే ఎంత నిరసన వ్యక్తం అవుతున్నా...కేసీఆర్ మొండిగా తాను యూనివర్సిటీ స్థలంలోనే నిర్మాణాలు జరిపితీరుతామని ప్రకటించారు. ఈ విషయంలో అసలు మర్మం వేరే ఉందంటున్నారు.. బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య.

ప్రభుత్వ స్థలాలుండగా..వర్సిటీ భూములపైనే సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టడంపై ఆంతర్యమేంటని కృష్ణయ్య ప్రశ్నించారు. హుడా, హౌసింగ్‌ బోర్డు, పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖల కింద 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి నగరంలోనే అందుబాటులో ఉందని గుర్తుచేశారు. నగరంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కంటోన్మెంట్‌, గోల్కొండ పరిధిలో 40 వేల ఎకరాల ఖాళీ భూమి ఉందని, కేంద్రంతో చర్చించి ఆ భూమిని పేదలకు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కృష్ణయ్య సూచించారు. గ్రేటర్‌ ఎన్నికలకోసం ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్‌ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించడానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ స్థలంలో ఇళ్లను కడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వెనుక మూడు ఎత్తుగడలు ఉన్నాయని ఆయన అన్నారు. వర్సిటీ విద్యార్థులు టీఆర్‌ఎస్‌ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమించకుండా వారి దృష్టి మళ్ళించడం ఇందులో మొదటిదని చెప్పారు. పేదలకు సీఎం ఇళ్లు కట్టిస్తామని ముందుకు వస్తే విద్యార్థులు, రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని దుష్ప్రచారం చేయడం రెండో విషయం అని చెప్పారు. మూడో మర్మం ఏమంటే... సమస్యను వివాదస్పదం చేయడం ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో చర్చ పెట్టడం సీఎం ఉద్దేశమని ఆరోపించారు. వివిధ సంఘాల నేతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం హస్టల్స్‌, కళాశాలల నిర్మాణానికి, కొత్త కోర్సుల ప్రవేశానికి ప్రత్యేక భవనాలు నిర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సచివాలయం కోసం కేంద్రంతో చర్చించినట్లే....పేదల భూముల కోసం కూడా చర్చించాలని తద్వారా కేసీఆర్్ను ఇరికించాలనేది కృష్ణయ్య వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News