బాంబు పేల్చిన ఆర్‌.కృష్ణ‌య్య‌

Update: 2015-11-26 06:58 GMT
రెండు తెలుగు రాష్ర్టాల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయా...రాజ‌కీయాల్లో మ‌రో పార్టీ రాబోతోందా?  సామాజిక వ‌ర్గాల ప్రాతిప‌దిక‌న ఓ కొత్త పార్టీ పురుడుపోసుకునే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయా? ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అంటే అవున‌నే అంటున్నారు బీసీ నేత - టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణ‌య్య‌. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఇటు తెలంగాణ‌లోనూ బీసీ కులాల విద్యార్థుల కోసం, వాళ్ల హ‌క్కుల కోసం పోరాడుతున్న నేత.. ఆర్ కృష్ణ‌య్య‌. 35 ఏళ్లుగా బీసీల హ‌క్కుల కోసం పోరాడుతూ.. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వానికి త‌మ నిర‌స‌న తెలియజేస్తున్న నేత కృష్ణ‌య్య‌. త‌ద‌నంత‌ర పరిస్థితుల్లో తెదేపాలో చేరి ఎమ్మెల్యేగానూ గెలుపొందారు.

కృష్ణ‌య్య‌కు ఎప్ప‌టినుంచో సొంత పార్టీ పెట్టాల‌నే కోరిక‌ ఉంద‌ట‌. ఆయన తరచూ ఈ ఆలోచ‌న‌న‌ను బ‌య‌ట‌కు వ్య‌క్త‌ప‌రుస్తూ వ‌స్తున్నారు కూడా. ఇప్పుడు మ‌ళ్లీ బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు, ఆ దిశగా ముందుకు వెళుతున్నామని వివ‌రించారు. ఆయ‌న తాజాగా మెదక్ జిల్లా రామాయం పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల‌కు యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలని మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. 2600 కులాలు  బీసీల్లో ఉండగా,  వాటిలో 2550 కులాలకు పార్లమెంటులో ఇంతవరకూ ప్రాతినిధ్యం దక్కలేదని ఆయన వివ‌రించారు.  

 సొంతంగా రాజకీయ శక్తిగా ఎదిగితేనే బీసీలకు ప్రజాస్వామ్య ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీల‌కు న్యాయం జరగడం లేదని కృష్ణయ్య ఆవేద‌న వ్య‌క్తంచేశారు. తెలంగాణలో 60 మంది బీసీ ఎమ్మెల్యేలుండాల‌ని, కానీ 19 మంది మాత్ర‌మే ఉన్నార‌ని ఆయ‌న గుర్తుచేశారు. అన్ని రాజ‌కీయ పార్టీలు బీసీల‌ను కేవ‌లం ఓట్ల కోస‌మే వాడుకుంటున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో వారికంటూ ప్ర‌త్యేక పార్టీ ఉంటే.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారొచ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  వాస్త‌వానికి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కృష్ణ‌య్య‌ను తెలంగాణ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా అక్క‌డ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే ఎన్నిక‌లైన నాటి నుంచి ఆయ‌న టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఆయ‌నే ఓ రాజ‌కీయ పార్టీ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు.
Tags:    

Similar News