గాంధీకి ‘మహాత్మ’ బిరుదు ఇచ్చిందెవరు..?

Update: 2016-02-16 04:04 GMT
‘‘జాతిపిత మహాత్మ గాంధీ’’ అన్న పదాన్ని తరచూ వాడుతుంటాం. మరి.. ఇందులోని ‘మహాత్మ’ అన్న బిరుదు గాంధీకి ఇచ్చిందెవరు? అన్న ప్రశ్న వేస్తే చాలామంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. కొందరు మాత్రం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెబుతారు. అయితే.. ఆ మాట తప్పని చెబుతోంది గుజరాత్ ప్రభుత్వం. తాజాగా నిర్వహించిన ఒక పరీక్షలో అడిగిన ఈ ప్రశ్న ఇప్పుడో చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకూ కొందరికి తెలిసిన మహాత్మ బిరుదు ఠాగూర్ ఇవ్వలేదని... ఒక విలేకరి ఇచ్చారంటూ చెప్పటంతో.. ఏది నిజం? అన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. చివరకు ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరుకున్న పరిస్థితి.

రాజ్ కోట్ జిల్లా పంచాయితీ శిక్షణ్ సమితిలోని రెవెన్యూ శాఖలో ఒక పోస్ట్ కు ఇటీవల పరీక్ష నిర్వహించారు. ఇందులో అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న.. మహాత్మ అన్న బిరుదును గాంధీజీకి మొదట ఎవరు ఇచ్చారు? అన్నది. దీనికి సరైన సమాధానం అంటూ ఆన్సర్ కీలో ‘ఒక గుర్తు తెలియని విలేకరి’గా ఇచ్చారు. అయితే.. ఇప్పటివరకూ ఉన్న అవగాహన ప్రకారం ఠాగూర్ ఇచ్చారని మాత్రమే తెలుసు. అయితే.. ఈ పరీక్షలో ఆన్సర్ తప్పు రాస్తే నెగిటివ్ మార్కులు ఉన్నాయి. దీంతో.. పరీక్ష రాసిన వారిలో సంధ్య అనే ఒక అభ్యర్థిని ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళుతూ పిటీషన్ వేశారు. దీనిపై గుజరాత్ ప్రభుత్వం తన వాదనను వినిపిస్తూ.. గాంధీజీకి మహాత్మ అన్న బిరుదును సౌరాష్ట్ర జిల్లాలోని జెత్ పూర్ పట్టణానికి చెందిన గుర్తు తెలియని విలేకరి ఒకరు గాంధీజీకి ఇచ్చినట్లుగా ఆయన కార్యదర్శి మహదేవ్ దేశాయ్ కుమారుడు నారాయణ్ దేశాయ్ తన ఆత్మకథలో రాసిన విషయాన్ని రాజ్ కోట్ జిల్లా పంచాయితీ శిక్షణ్ సమితి కోర్టుకు చెప్పింది.

పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాన్ని అధికారులు తయారు చేయలేదని.. ఒక బయట సంస్థ చేసిందని పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు.. ఇలాంటి పరీక్షల్ని జాగ్రత్తగా నిర్వహించాలని చెబుతూ.. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. సో.. గాంధీజికి మహాత్మ అన్న బిరుదు ఇచ్చింది ఎవరన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా లభించలేదనే చెప్పాలి.
Tags:    

Similar News