టీవీని హ్యాక్ చేసిన బాబు..పోలీసుల‌కు ఫిర్యాదు

Update: 2018-04-16 05:00 GMT
ఔను. మీరు స‌రిగ్గానే చ‌దివారు. ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు టీవీని హ్యాక్ చేసేశారు. త‌ద్వారా స‌ద‌రు వ్య‌క్తి ఇంట్లో బాబు బొమ్మ త‌ప్ప‌ మ‌రే బొమ్మ రావ‌డం లేదు. దీంతో ఆ వ్య‌క్తికి చిర్రెత్తుకొచ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగింది హైద‌రాబాద్‌ లో..ఫిర్యాదు చేసింది రాచ‌కొండ పోలీసుల‌కు.! `చంద్ర‌బాబు ఏంటి...ఒక వ్య‌క్తి టీవీని హ్యాక్ చేయ‌డం ఏంటి...ఫిర్యాదు ఏంటి?` అనుకుంటున్నారా?   ఫిర్యాదు నిజమే. హ్యాకింగ్ అబ‌ద్దం. ఇదంతా ఓ మాన‌సిక స‌మ‌స్య‌. ప్యారనాయిడ్ స్కీజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతూ వ‌చ్చిన ఫిర్యాదుల్లో ఇదొక‌టి.

`నేను ఉదయం టీవీ పెట్టగానే చంద్రబాబునాయుడే కనిపిస్తున్నాడు.. ఏ చానల్ పెట్టినా అతడే వస్తున్నాడు.. చంద్రబాబునాయుడు మా టీవీని హ్యాక్ చేశాడు.. మేం వేరే చానళ్లు చూడలేకపోతున్నాం.. కేబుల్ టీవీ ఆపరేటర్‌ ను అడిగితే మిగతావారికంతా బాగానే వస్తుంది మీకే ఎందుకు అలా వస్తుందో మాకు అర్థం కావడం లేదంటూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లోని టీవీని హ్యాక్ చేయాల్సిన అవసరం బాబుకు ఎందుకొచ్చింది? మా టీవీని హ్యాక్ చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి?`అంటూ ఓ మహిళ రాచ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. `నాపై ఒక గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడి జరిపాడు. అయితే అది వర్చువల్‌ గా జరిగింది. అతనెవరో మీరు దర్యాప్తు చేసి తెలుసుకోవాలి.. నన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు.. అతడు కన్పిస్తే చంపేయాలని ఉంది. నాకు అతనిపై కోపం కట్టలు తెంచుకుంటోంది.. మీరు అతనిని వెంటనే గుర్తించి పట్టుకోవాలి` ఇది ఇంకో మ‌హిళ‌ ఫిర్యాదు! ఇలాంటి ఫిర్యాదుల గురించి రాచ‌కొండ పోలీసులు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీడియాతో పంచుకున్నారు.

పై రెండు ఘటనల్లో అవతలివాళ్లను వాళ్లు చూడలేదు. వాళ్లే శత్రువును ఊహించుకుంటారు. ఆ శత్రువుతో ఊహాలోకంలో నిరంతరం యుద్ధం చేస్తుంటారు. ఏవేవో తమను చుట్టుముడుతుంటాయి. జరుగని విషయాలు జరిగినట్టు అనిపిస్తుంటాయి. తమనెవరో వెంబడిస్తుంటారు. కానీ ఆ వెంబడించేవాళ్లెవరో అస్సలు కనబడరు. తమ మెదడును తమ ప్రమేయం లేకుండా అదుపులోకి తీసుకున్నట్టు భ్రమిస్తుంటారు. భ్రాంతికి గురవుతుంటారు. తెలియని ఒక మాయాప్రపంచంలోకి కూరుకుపోతుంటారు. కారణం ఏదైనా మొత్తానికి రకరకాల మానసిక వైకల్యాలకు లోనవుతున్నారు.  ఆ కనిపించని శత్రువులను ఎలాగైనా సరే పట్టుకొని శిక్షించాలని పోలీసుల వెంటపడి ఫిర్యాదులు చేస్తుంటారు. చుట్టూ పదిమంది ఉన్నా ఒంటరవుతున్నారు. ఆనందం - సంతోషం - సుఖం - దుఃఖం - ఆక్రోశం - బాధ - ఆవేదన పంచుకునేందుకు సరైన వ్యక్తులు తగినంత వ్యవధి లేక మనుషులు లోలోపలే మానసికంగా కృంగిపోతున్నారు. వంశపారంపర్యంగా వచ్చే మానసిక లక్షణాలు కూడా వీటికి తోడవుతుండడంతో ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్యారనాయిడ్ స్కీజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతూ.. తమను మానసిక శక్తితో లేదా టెక్నాలజీపరంగా ఇతరులు ఇబ్బందులు పెడుతున్నారంటూ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో వీటిని ఎలా ప‌రిష్క‌రించాలో తెలియ‌క‌..వారిని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపి కౌన్సిలింగ్‌కు పంపిస్తున్నామంటూ పోలీసులు వెల్ల‌డిస్తున్నారు.

తీవ్రమైన మానసిక సమస్యలున్నవారు ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారని మాన‌సిక నిపుణులు చెప్తున్నారు. `వారు సమస్యలను ఊహించుకుంటారు. ఎక్కువగా వంశపారంపర్యంగా మానసిక వ్యాధులున్న కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులను తట్టుకోలేనివారు - ఏకాంతంగా ఉంటూ ఆలోచన చేసేవారు, ఇతరులను కలిస్తే వాళ్లు ఏమనుకుంటారోనని ఆందోళనకు గురయ్యేవారు, వయస్సు పెరుగుతుంటే ఇతరులను కలుసుకునేందుకు జంకుతూ ఒంటరితనానికి అలవాటు పడేవారు - అనారోగ్యాలతో ఉండేవారిలో వారిలో ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఏవేవో జరిగినట్టు ఊహించుకుంటుంటారు. చెవిలో మాటలు విన్పించినట్టు అనిపిస్తుంది. ఏదో ఊహించుకొని అది నిజమని నమ్మేసి పోలీసులకు వద్దకు పరుగెత్తుతారు. తక్షణమే తమ సమస్య పరిష్కారం కావాలని పోలీసుల వెంట పడుతారు.

ప్యారనాయిడ్ ష్కీజోఫ్రేనియా లక్షణాలు

-ఏవేవో ఊహలు కలుగుతుంటాయి. ఎవరో తరుముతున్నట్టు భావిస్తారు.

-తమ ప్రతి చర్యను ఎవరో గమనిస్తున్నట్టు, ప్రభుత్వం తమ మీద నిఘాపెట్టినట్టు ఆందోళనకు గురవుతుంటారు.

-చుట్టూ ఉన్న ప్రతిఒక్కరూ తమను దెబ్బతీయాలని చూస్తున్నట్టు భ్రమలు కలుగుతుంటాయి.

-చెవిలో ఏవో శబ్దాలు వినపడుతుంటాయి. ఎవరో తన గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది.

-ఎవరో తమ మీద దాడికి ప్రయత్నిస్తున్న భావనలు కలుగుతాయి. దాడి జరిగిపోయినట్టు కలవరపడిపోతుంటారు.

-తోటి ఉద్యోగి - లేదా ఇరుగుపొరుగు తమపై విషప్రయోగం చేసినట్టు అనుమానాలు పడుతుంటారు.

-ఇవన్నీ భ్రమలే - అనవసరంగా అన్నీ ఊహించుకుంటున్నారు అని చెప్తే ఒప్పుకోకుండా తగాదాకు దిగుతారు.
Tags:    

Similar News