వెంకయ్య చిడతలను మరో మంత్రి అందుకున్నారు

Update: 2016-04-11 17:05 GMT
పార్టీల అధినేతలను, అధికార కేంద్రాలుగా ఉన్న వారిని ప్రసన్నం చేసుకుంటే చాలు.. తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని భావించే వందిమాగధ బాపతుకు చెందిన నేతలు అనేకమంది ఉంటారు. వ్యక్తిపూజ అధికంగా ఉండే అన్ని పార్టీల్లోనూ ఈ సంస్కృతి బీభత్సంగా ఉంటుంది. అయితే తమది సిద్ధాంతాల పునాదుల మీద ఉన్న పార్టీ అని చెప్పుకునే భాజపాలో కూడా మోదీ శకం మొదలైన తర్వాత.. వ్యక్తిపూజ విశృంఖలంగా సాగుతున్న సంగతి అందరూ గమనిస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్లుగానే.. కేంద్రమంత్రులు మోదీని దైవస్వరూపుడిగానూ, దేవుడి వరప్రసాదంగానూ, దేవుడి బిడ్డగానూ కీర్తించే వైఖరి కూడా విచ్చలవిడిగా పెరిగింది.

వెంకయ్యనాయుడు ఈ తరహా దైవత్వపు భజనకు శ్రీకారం చుట్టిన నాయకుడని చెప్పాల్సిందే. మోడీని దేవుడే స్వయంగా భూలోకానికి పంపాడని, ఆయన దైవ సమానుడని అంటూ వెంకయ్య గతంలో ఎన్ని సందర్భాల్లో కీర్తించారో లెక్కే లేదు. మోడీ భజన చేయాలంటే వెంకయ్యనాయుడు తర్వాతే ఎవరైనా అనిపించేంత ఘనతను ఆయన సాధించారు.

ఇన్నాళ్లకు ఇప్పుడు కేంద్రంలోని మరో మంత్రి వర్యులు కూడా ఈ బాధ్యతను పంచుకుంటున్నట్లుగా ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ సోమవారం నాడు ఢిల్లీలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, భాజపా పార్టీలు భారతదేశానికి దేవుడిచ్చిన వరాలు అని వ్యాఖ్యానించారు. మోడీని ఆయన బీభత్సంగా ఆకాశానికెత్తేశారు. మోడీ అంతగా ఈ దేశాన్ని గురించి గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదంటూ, వాజపేయి ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్‌ తో కలిపి ఒకే గాటన కట్టేస్తూ రాధామోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే ఒక దుమారం సృష్టిస్తున్నాయి. మోడీని సాక్షాత్తూ దేవుడే అనేయడం ఒకటే తక్కువ... మరీ వెంకయ్య నుంచే చిడతలను అరువు తీసుకున్నట్లుగా ఆయన స్థాయిలోనే ఈ మంత్రి గారు కూడా భజన చేయడం ఆశ్చర్యకరం.
Tags:    

Similar News