జైట్లీకి - బాబుకు నంది అవార్డు ఇవ్వాల్సిందే

Update: 2018-02-10 16:13 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ నటుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జేఏసీపై అప్పుడే అనుమానాలు మొద‌లవుతున్నాయి. అదే స‌మ‌యంలో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా సీనియ‌ర్ క‌మ్యూనిస్టు నాయకుడు - సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. బీమవరంలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న‌ సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాఘ‌వులు మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో టీడీపీ పేరు ఎత్తలేదని..బీజేపీని మాత్ర‌మే ప్ర‌స్తావిన్నారని వివ‌రించారు. బీజేపీ-టీడీపీతోడుదొంగలని, ప‌వ‌న్ కామెంట్లను గ్రహించాలని సూచించారు.


విభజన హామీలు సాధించేందుకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జేఏసీ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారని..ఇప్పటికే  ఏపీలో ఎన్నో జేఏసీలున్నాయని..పవన్ జేఏసీ అవసరమా ? అని రాఘ‌వులు ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని..సీపీఎం మొదటి నుండి చెబుతూ వచ్చిందని...విభజన జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆనాటి నుండి చెబుతూ వస్తున్నామని..విభజన చేస్తామని..మంచి జరుగుతుందని..స్పెషల్ స్టేటస్..రాయితీలు ఇస్తామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. స్పెషల్ స్టేటస్ అవసరం లేదని..స్పెషల్ ప్యాకేజీ అంటూ మొదటి మోసం చేశారని తెలిపారు. ఎక్కువ సాధిస్తామని..ఎక్కువే సాధించామని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారని తెలిపారు.

రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ అని పేర్కొన్నారని..రూ. 3వేల కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదని రాఘ‌వులు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇనుప ఖనిజం స్వతంత్రంగా ఇస్తామని చెప్పారని..రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని..కడపలో స్టీల్ ప్టాంట్ నిర్మాణం..కాకినాడ రీఫైనరీ ఏర్పాటు..ఇలా ఎన్నో చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమి చేయలేదన్నారు. ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాటకం జరగుతోందని..నాటికలకు నంది అవార్డులు ఇచ్చినట్లే కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులకు అవార్డులు ఇవ్వొచ్చని రాఘ‌వులు ఎద్దేవా చేశారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయ విధానం లేదని..వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరించాలని రాఘవులు పిలుపునిచ్చారు.
Tags:    

Similar News