'మూడు' రాజధానులు వర్కువుట్ కాదా? సీఎం జగన్ కు అర్థమైందా?

Update: 2022-08-09 15:30 GMT
మీరు నాకు ఓట్లేయండి.. నేను ఏపీని ఎక్కడికో తీసుకెళతాను. రాజధానిగా అమరావతినే ఉంటుంది. దాన్ని మరో స్థాయికి తీసుకెళతా.. ఇలాంటి హామీలెన్నో ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మిన ఏపీ ప్రజలు ఆయనకు అధికారాన్ని అప్పజెప్పటం తెలిసిందే. పవర్లోకి వచ్చిన కొద్ది నెలలకే ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే కాదు మరో రెండు రాజధానులు అవసరమన్న జగన్ సూత్రీకరణ సంగతి తెలిసిందే. అప్పటి మొదలు ఇప్పటివరకు రాజధానులు ఎన్ని అన్న దానిపైనే చర్చ నడుస్తూనే ఉంది తప్పించి.. ఏదీ తేల్లేదు.

అమరావతి మాత్రమే ఉంటుందని.. మూడు రాజధానులు సాధ్యం కాదని కొందరు వ్యాఖ్యానిస్తే.. ఎందుకు కాదు.. మూడు రాజధానులే ముద్దు అంటూ మరికొందరు జట్లుగా విడిపోయి వాదులాడేసుకునే వేళ.. ఏపీకి రాజధాని అన్నది ఉండదా? అన్న దిగులు ఏపీ ప్రజల్లో ఎక్కువైంది. ఇదిలా ఉండగా.. తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రైవేటు బిల్లు పెట్టటం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఆ ప్రైవేటు బిల్లు సారాంశం ఏమంటే.. మూడు రాజధానులకు సంబంధించిన అని చెబుతున్నారు. ఇప్పటివరకు దేశం ఏర్పడిన తర్వాత ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టి.. దాన్ని విజయవంతంగా పూర్తి చేసి.. పార్లమెంటు ఆమోదం పొందింది రెండు సందర్భాల్లోనే అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణమరాజు సైతం ఇదే విషయాన్ని చెబుతూ.. అమరావతిని తరలించటం అసాధ్యమన్న విషయం జగన్ కు అర్థమైందన్నారు.

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు విజయసాయి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టటంతో జగన్ ప్రభుత్వానికి అమరావతిని తరలించటం సాధ్యమయ్యే విషయం కాదన్నది తేలినట్లేనని చెప్పారు. "తాము చేసిన పిచ్చి పనిని.. పార్లమెంటు ద్వారా దాన్ని అధికారికం చేయమన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. అదేమీ సాధ్యం కాదు" అని రఘురామ స్పష్టం చేశారు.

పార్లమెంటు వ్యవస్థ మనుగడలోకి వచ్చిన తర్వాత రెండు ప్రైవేటు మెంబరు బిల్లులే ఆమోదం పొందటం చూస్తే.. ఏపీ రాజధానిగా అమరావతి తప్పించి.. మరింకేమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విషయం విజయసాయి పెట్టిన ప్రైవేటు బిల్లుతో స్పష్టమైనట్లేనని చెబుతున్నారు.

ఎవరైనా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి.. ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చేమో కానీ.. అమరావతిని రాజధానిగా కదిలించటం అసాధ్యమని తేలిపోయినట్లేనని రఘురామ చెబుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు రాష్ట్ర అంశమే అయి ఉంటే.. మూడు రాజధానుల ఆమోదం కోసం పార్లమెంటు ఆమోదం కోసం ప్రైవేటు బిల్లును విజయసాయి ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే.. రఘురామ చెప్పింది నిజమే అవుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News