మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-31 05:57 GMT
నరసాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన రచ్చబండ నిర్వహించారు. రచ్చబండ పేరుతో గత కొంత కాలంగా వివిధ రాజకీయ పరిస్థితులపై ఆయన విశ్లేషిస్తున్నారు. తాజాగా నిర్వహించిన రచ్చబండలో వైసీపీ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు, నారా లోకేష్‌ పాదయాత్ర, విశాఖలో మానసిక వికలాంగుల పాఠశాలను కూల్చేయడం వంటివాటిపై రఘురామకృష్ణరాజు రచ్చబండ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు. వైఎస్సార్‌సీపీలో సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు మొదలైందన్నారు. అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న సమరంగా వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటును ఆయన అభివర్ణించడం గమనార్హం. ఆత్మాభిమానానికి ఒకప్పుడు తాను ప్రతీక అని.. ఈ కోవలో ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి చేరారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ నిలువెత్తు అహంకారానికి నిదర్శనమని ఆర్‌ఆర్‌ఆర్‌ నిప్పులు చెరిగారు.

వైసీపీలో ఇన్నిరోజులుగా ఓపిక పట్టినవారు, అవమానాలను సహించినవారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఆనం రామనారాయణరెడ్డి మాదిరిగానే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, తదితరులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారని గుర్తు చేశారు. అలాగే వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సైతం జగన్‌ విధానాలపై విమర్శలు చేశారన్నారు.

డీఎల్‌ రవీంద్రారెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంపైన రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. 32 ఏళ్ల చిన్న వయసులోనే డీఎల్‌ రవీంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తమకు కావాలనే వైసీపీ పార్టీలో చేర్చుకుందన్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదనడంపై ఎద్దేవా చేశారు.

కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వేర్వేరుగా హాట్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో ఒక్క పని కావడం లేదని.. అధికారంలో ఉండి ప్రజలకు ఏ మేలూ చేయలేకపోతున్నామని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News