ఆర్ఆర్ఆర్ మర్డర్ ప్లాన్..టైం ఎప్పుడు.. ప్రధానికి లేఖ

Update: 2021-12-09 15:33 GMT
వైసీపీ ప్రభుత్వాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేయని రోజంటూ లేదు. నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వ్యవహారశైలి చూస్తే అర్థమవుతుందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఆయన ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి అనేక సార్లు లేఖలు రాశారు. ఇప్పుడే ఏకంగా తనను చంపుతానని తన సహచర ఎంపీ బెదిరించాడని ప్రధాని లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఆ లేఖలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. తమ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనను హత్య చేస్తానని బెదిరిస్తున్నారని తెలిపారు. తాను బుధవారం ఉదయం 10.40 గంటల సమయంలో వైద్య, ఆరోగ్య కమిటీ సమావేశం పూర్తి చేసుకుని తిరిగి పార్లమెంటు ఆవరణలోని నాలుగో గేటు నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న మాధవ్‌ తనను చూసి, 'ఒరేయ్‌.. నిన్ను మర్డర్‌ చేసి దెం...' అని బెదిరించారని రఘురామ తెలిపారు.

గతంలో వైసీపీ ఎంపీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోనూ బెదిరించారని, ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తిరిగి ఇప్పుడు మాధవ్ బెదిరించడంపై ప్రధానికి లేఖ రాశానని రఘురామ తెలిపారు. మాధవ్‌ చరిత్ర చూస్తే, ఆయన తన భార్యను కూడా హత్య చేసినట్లు సోషల్‌ మీడియాలో ఆరోపణలు వచ్చాయని రఘురామ గుర్తుచేశారు. సీఎం జగన్‌ అండతోనే వైసీపీ ఎంపీలు తనను దూషిస్తున్నారని వాపోయారు. మర్డర్‌ చేస్తామని పార్లమెంటు సాక్షిగా పదేపదే భయపెడుతున్నారని ఆయన తెలిపారు. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ తనను లోక్‌సభ సాక్షిగా అసభ్యకర పదాలతో దూషించారని, అందువల్ల ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన కింద తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ, ప్రధానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో జీరో అవర్‌ సమయంలో తాను అమరావతి రాజధాని సమస్యపై మాట్లాడుతున్న సందర్భంలో సురేశ్‌ తనను 'లం...కొడకా' అని తెలుగులో నీచంగా తిట్టారని ఫిర్యాదులో తెలిపారు. గతంలో కూడ సురేశ్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇప్పటికైనా తన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించి, సురేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కోరారు.

మరోవైపు పార్లమెంట్ లో బయట వైసీపీ ప్రభుత్వంపై రఘురామ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గురువారం పార్లమెంట్ సమవేశాల్లో ఏపీలో మద్యం అమ్మకాల్లో గోల్‌మాల్‌పై జరుగుతోందని ప్రస్తావించారు. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా స్ఫూర్తికి విరుద్ధంగా లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం షాపుల్లో నగదు మాత్రమే తీసుకోవడం వెనుక పెద్ద స్కామ్‌ ఉందన్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు జరగడం లేదని ఆరోపించారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో లావాదేవీలపై కేంద్రం దృష్టిసారించాలని కోరారు,  డిజిటల్‌ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News