మోడీకి రిజర్వ్ బ్యాంకు గవర్నరు వార్నింగ్

Update: 2016-01-31 06:47 GMT
 భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి పరోక్ష హెచ్చరికలు చేసిన ఆయన తాజాగా కాస్త గట్టిగానే తన మనసులోని మాటలను చెప్పేశారు. మేకిన్ ఇండియా నినాదం వద్దని ఆయన మోడీని హెచ్చరిస్తున్నారు. ప్రపంచమంతా ఆర్ధిక సక్షోభంలో కూరుకుపోయి ఉంటే మేకిన్ ఇండియా అంటూ ఇక్కడ వస్తువులు తయారు చేసి ఎక్కడ అమ్ముతారని ఆయన ప్రశ్నిస్తున్నారు.  ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికల సిద్ధం చేస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని రఘురామ్ సూచించారు. స్పీడు తగ్గించమని పరోక్షంగా మోడీకి ఆయన సూచనలు చేశారు.  రీసెంటుగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.  2010 - 2011 ప్రాంతంలో యూపీఏ ప్రభుత్వం ఓవర్ స్పీడుతో అభివృద్ధికి ప్రయత్నించిందని, ఫలితంగా 2013 - 2014 లో వృద్ధి రేటు మందగించిందన్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూడటమే తక్షణ కర్తవ్య మని  ఆయన స్పష్టం చేశారు. రుణాలు చేసి మరీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్ దేశాల్లో(బ్రెజిల్ - దక్షిణాఫ్రికా - చైనా - ఇండియా) ఇండియాయే కాస్త పద్ధతిగా ఉన్న ఆర్థిక వ్యవస్థని...  దాన్ని చెడగొడితే బ్రెజిల్ దేశంలో ఏర్పడిన పరిణామాలు వంటివి ఇక్కడ ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు.

బ్రెజిల్ కూడా వర్ధమాన దేశమే... భారీ మొత్తంలో అప్పులు చేసి ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులు పెట్టింది. కానీ, ఇప్పుడు బ్రెజిల్ ద్రవ్యోల్యణం రెండంకెల స్ధాయిలో ఉండటంతో పాటు ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయి వడ్డీలు చెల్లించలేని స్ధితిలో ఉంది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి బ్రెజిల్ నానా కష్టాలు పడుతోందని రాజన్ అన్నారు. ద్రవ్యలోటును అరికట్టాల్సిన కేంద్ర ప్రభుత్వ తన బాధ్యతలను వాయిదా వేసుకొంటోందని.. జీడీపీలో ద్రవ్యలోటు 3 శాతం మించరాదని తెలిసినా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెంచారని ఆయన ఆరోపించారు.  మొత్తానికి జైట్లీ, మోడీ పద్ధతులను రఘురామ్ రాజన్ ఏమాత్రం సహించడం లేదని అర్థమవుతోంది.  ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు మధ్య సయోధ్య లోపిస్తున్నే ఉంది.
Tags:    

Similar News