సీబీఐని కూడా బెదిరించే సీఎం ఉన్నా ఏపీకి వ‌స్తానంటున్న రఘురామ‌!

Update: 2022-06-24 03:28 GMT
జూలై 4న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు తాను త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతాన‌ని వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తేల్చిచెబుతున్నారు. తాను స్థానిక ఎంపీన‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టిస్తార‌ని అంటున్నారు. ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో స్థానిక ఎంపీగా త‌న‌కు పాల్గొనే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీబీఐని కూడా బెదిరించే ముఖ్య‌మంత్రి ఉన్నార‌ని ర‌ఘురామరాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నేర చ‌రిత్ర ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌పై కూడా కేసులు న‌మోదు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌స్తే త‌న‌ను అరెస్టు చేస్తార‌ని చాలామంది చెబుతున్నార‌ని.. అయినా తాను రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో వ‌స్తాన‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వివ‌రించారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను భ‌య‌ప‌డ‌బోన‌ని చెబుతున్నారు. స్థానిక ఎంపీగా త‌న హ‌క్కుల‌ను అడ్డుకుంటే స‌భాహ‌క్కుల కింద లోక్ స‌భ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేస్తాన‌ని ర‌ఘురామ హెచ్చ‌రిస్తున్నారు.

సీఎం జ‌గ‌న్ కేసులు పెట్టుకుంటు పెట్టుకోవాల‌ని స‌వాల్ చేస్తున్నారు. తాను ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటాన‌ని.. తాను వ‌చ్చి వెళ్లాక ఎన్ని కేసులు పెట్టుకోవాల‌నుకుంటే అన్ని కేసులు పెట్టుకోవాల‌ని స‌వాల్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ను, హోంశాఖ కార్యదర్శిని క‌లిశారు. జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు తాను వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వం, నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని వారి దృష్టికి తెచ్చారు, తాజాగా విశాఖ లో పార్లమెంటరీ కమిటీ సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించినా తనను అడ్డుకున్నారని ర‌ఘురామ‌కృష్ణంరాజు విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ప్రధాని న‌రేంద్ర మోడీ భీమవరం టూర్ లో తనకు తగిన భద్రత కల్పించేలా జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాలని విన్న‌వించారు. అయితే దీనిపై కేంద్ర‌ హోంశాఖ ఇంకా స్పందించ‌లేదు.

కాగా 2019 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గెలుపొందారు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అయితే గెలిచిన కొద్ది రోజుల‌కే వైఎస్సార్సీపీ అధిష్టానంతో ఆయ‌న‌కు విభేదాలు పొడ‌సూపాయి. అప్ప‌టి నుంచి ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణ‌యాల‌ను, ప్ర‌భుత్వ త‌ప్పులు, వైఫ‌ల్యాల‌ను ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎత్తిచూపుతున్నారు. ఈ క్ర‌మంలో ర‌ఘురామ‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనేక కేసులు పెట్టింది.

గ‌తేడాది ఆయ‌న హైద‌రాబాద్ లో ఉండ‌గా ఏపీ పోలీసులు అక్క‌డికి వెళ్లి అరెస్టు చేయ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది.
పోలీస్ క‌స్ట‌డీలో త‌న‌ను పోలీసులు కొట్టార‌ని ర‌ఘురామ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న‌కు ప్రాణ‌హాని పొంచి ఉంద‌ని ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న‌కు కేంద్రం వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించింది.
Tags:    

Similar News