విజ‌య‌మ్మ కారు ప్ర‌మాదంపై ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2022-08-13 08:30 GMT
కొద్ది రోజుల క్రితం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణి వైఎస్ విజ‌య‌మ్మ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గుర‌యిన సంగ‌తి తెలిసిందే. టైరు పేలిపోవ‌డంతో కారు ప్ర‌మాదానికి గుర‌యింది. అయితే విజ‌య‌మ్మ సుర‌క్షితంగా ఈ ప్ర‌మాదం నుంచి బయ‌ట‌ప‌డ్డారు.

ఈ ప్ర‌మాదంపై వైఎస్సార్సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి కార్లు వాడుతున్నాన‌ని.. ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు కార్ల‌లోనే ప్ర‌యాణించాన‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఎప్పుడూ టైర్లు పేలిపోవ‌డం జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

15 ఏళ్ల క్రిత‌మే ట్యూబ్ లెస్ టైర్లు వ‌చ్చాయ‌న్నారు. అందులోనూ విజ‌య‌మ్మ ప్ర‌యాణిస్తున్న కారు ట‌యోటా వెల్ఫేర్ మోడ‌ల్ అని.. అది నేరుగా విదేశాల నుంచి దిగుమ‌తి అయ్యింద‌న్నారు. భార‌త‌దేశంలో దానికి ఏమీ చేయ‌ర‌న్నారు. ఆ కారు ఇప్ప‌టివ‌ర‌కు 3500 కిలోమీట‌ర్లు మాత్ర‌మే తిరిగింద‌న్నారు. ఆ కారు టైర్లు కూడా ట్యూబ్ లెస్ అని తెలిపారు. అలాంటి కారుకి రెండు టైర్లు పేలిపోవ‌డం అసంభ‌వ‌మ‌ని చెప్పారు.

ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సీరియ‌స్ గా తీసుకుని త‌క్ష‌ణం విచార‌ణ చేయించాల‌ని ర‌ఘురామ కోరారు. ఒక‌వేళ వాళ్లు అనుకుంటున్న‌ట్టు దుష్ట చ‌తుష్ట‌యం పాత్ర కానీ, నారాసుర చ‌రిత్ర అని అప్పుడు వాళ్లు సాక్షిలో రాయించుకున్నారు కాబ‌ట్టి అలాంటిదేమైనా జ‌రిగిందేమో తెలుసుకోవాల‌న్నారు. అలాగే ఏదైనా కుట్ర ఉందేమో క‌నిపెట్టాల‌న్నారు. టైర్లు బాగా అరిగిపోతే త‌ప్ప టైర్లు పేలిపోవ‌డం ఉండ‌ద‌ని.. అందులోనూ రెండు టైర్లు పేలిపోవ‌డం అస‌లు జ‌ర‌గ‌ద‌ని తేల్చిచెప్పారు. విజ‌య‌మ్మ ప్ర‌యాణిస్తున్న కారు టైర్లు పాత‌ప‌డ‌లేద‌ని.. ఆ ట‌యోటా కారు కొత్త‌దేన‌న్నారు. ఒకేసారి రెండు టైర్లు పేలిపోవ‌డం త‌న‌కు న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్నారు.  

అతి త‌క్కువ స్పీడులో కారు వెళ్తుంద‌న్నారు. అలాగే ఇది ఎండా కాలం కాద‌ని.. అందువ‌ల్ల టైర్లు పేలిపోవ‌డానికి చాన్స్ లేద‌న్నారు. ప్ర‌స్తుతం వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని వ‌ర్షాకాలంలో రెండు టైర్లు పేలిపోవ‌డం ఎందుకు జ‌రిగిందో ఆ జిల్లా ఎస్పీతో చెప్పించ‌డం కాకుండా కారు కంపెనీతో మాట్లాడి వివ‌ర‌ణ ఇప్పించాల‌న్నారు. ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాల‌ని సీఎం జ‌గ‌న్ ను కోరారు.

కాగా గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారంపైన ఎంపీ ర‌ఘురామ స్పందించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించాలని తాను ప్రభుత్వానికి సలహా ఇచ్చాన‌న్నారు. ఈ కారణంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాపై దేశద్రోహం కేసులు పెట్టి.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కూడా అడుగుపెట్ట‌కుండా చేసింద‌ని ఆరోపించారు. కానీ న్యూడ్ వీడియో వ్య‌వ‌హారంలో దొరికిన‌ గోరంట్ల మాధవ్‌కు 500 కార్ల కాన్వాయ్‌తో స్వాగతం పలుకుతున్నార‌ని మండిప‌డ్డారు.
Tags:    

Similar News