బ్యాంకుఅప్పుల గురించి ఎంపి మాట్లాడటమా ?

Update: 2021-06-17 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ ఆర్దిక పరిస్ధితిపై వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాశారు. తన లేఖలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై పాపం ఎంపి చాలా బాధపడుతున్నట్లే అర్ధమవుతోంది. రాష్ట్రంలో ఆర్ధికపరిస్ధితులు చాలా దిగజారిపోయాయట. ఆస్తులను తాకట్టుపెట్టి బ్యాంకుల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు తీసుకుంటోందట. భవిష్యత్తులో ఈ అప్పులను తీర్చే మార్గాలు ఉండదని ఎంపి జోస్యం చెప్పారు.

బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులు తీర్చలేకపోతే అవన్నీ మొండి బకాయిలుగా మారిపోతాయని ఎంపి తెగ బాధపడిపోయారు. మొండి బకాయిలు పెరిగిపోతు బ్యాంకులు నష్టపోతాయని ఎంపి గారి బాధ. కాబట్టి జగన్ ప్రయత్నాలను అడ్డుకుని రాష్ ట్రపరిస్ధితి చక్కదిద్దాలంటు ఎంపి గారు ప్రధానికి పెద్ద లేఖ రాయటమే ఆశ్చర్యంగా ఉంది. బ్యాంకు లోన్లు, బకాయిలు, మొండి బకాయిలంటు బాధ పడిపోయిన ఎంపిగారు ఇదే విషయంలో తానేమి చేశారో మరచిపోయినట్లున్నారు.

వివిధ బ్యాంకుల నుండి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పురూపంలో తీసుకుని కొంత ఎగ్గొట్టి, మరికొంత పక్కదారికి మళ్ళించారనే ఆరోపణలనున్నాయి ఎంపి మీద. ఎంపి మీద బ్యాంకుల కన్సార్షియమే ఫిర్యాదు చేసింది. ఆరోపణల పై దర్యాప్తు చేసిన సీబీఐ అవన్నీ నిజాలే అని నిర్ధారించింది. ఎన్నికోట్లు ఎగొట్టారు ? ఎన్నికోట్లు దారిమళ్ళించారనే విషయంలో సీబీఐ దర్యాప్తు చేసి రఘురామ పై కేసులు కూడా బుక్ చేసింది. బ్యాంకు అప్పుల ఎగవేత పై కేసులను ఎదుర్కొంటున్న ఎంపిగారు ఇపుడు మొండిబకాయిల పై బాధపడిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

అన్నింటికన్నా విచిత్రమేమిటంటే అప్పులపై ప్రధానికి ఫిర్యాదు చేయటమే. నిధుల కోసం జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాకట్టుపెడుతున్నది నిజమే అనుకుందాం. మరి ఇవే నిధుల కోసం నరేంద్రమోడి ఏమి చేస్తున్నారు ? జగన్ తాకట్టుపెడుతుంటే మోడి ఏకంగా అమ్మేస్తున్నారు. గడచిన ఏడేళ్ళల్లో కేంద్రప్రభుత్వ రంగ సంస్ధలను ఎన్నింటిని మోడి అమ్మేశారో లెక్కేలేదు. దాదాపు 70 సంస్ధలను అమ్మేయటానికి కేంద్రం తాజాగా పెద్ద జాబితానే తయారుచేసింది. మరీ విషయం ఎంపిగారికి తెలీదా ?
Tags:    

Similar News