టెన్ష‌న్ రేపుతున్న ఆర్ ఆర్ ఆర్ న‌ర‌సాపురం టూర్‌!

Update: 2022-01-11 17:30 GMT
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురంలో రెండు రోజులు ప‌ర్య‌టించ‌నున్నారు. వాస్త‌వానికి ఏ ఎంపీ అయినా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాల‌నే కోరుకుంటారు. ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ కావాల‌నే కోరుకుంటారు. అయితే.. ఇత‌ర ఎంపీల‌కు, ఆర్ ఆర్ ఆర్‌కు తేడా ఉంది. ఈయ‌న వైసీపీ ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూప‌డం.. ముఖ్యంగా ప్ర‌జ‌ల ప‌క్షాన గ‌ళం వినిపించ‌డం.. ప్ర‌భుత్వ పెద్ద ల అక్ర‌మాల‌ను ఎత్తి చూప‌డం వంటి నేప‌థ్యంలో ఆయ‌న‌కు పార్టీ అధిష్టానానికి మ‌ధ్య తీవ్ర యుద్ధం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఏకంగా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు కూడా పార్టీ రెడీ అయిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే దాదాపు రెండేళ్లుగా ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోనే ఉంటూ.. నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టారు. త‌న‌పై దాడి జ‌రుగుతుంద‌న్న ముంద‌స్తు స‌మాచారంతో అనే క‌సార్లు.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాల‌ని అనుకున్నా.. వెనుక‌డుగు వేశారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ఈ నెల 13 సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని రెండు రోజుల పాటు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాల‌ని అనుకున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసుకున్నారు. అయితే.. ప్ర‌భుత్వం నుంచి లేదా.. త‌న‌ను వ్య‌తిరేకించే వారి నుంచి త‌న‌కు ముప్పు ఉంద‌ని భావిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌.. ప‌టిష్ట‌మైన ముంద‌స్తు చ‌ర్యలు చేప‌ట్టారు.

తనపై ఎవరైనా దాడి చేస్తారేమో అని, తనపై ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని అనుమానించినట్లున్నారు. అందుకనే తానుండబోయే రెండు రోజులు పక్కనే ఇద్దరు వ్యక్తులు తన ప్రతి కదలికను వీడియో తీస్తారని చెప్పారు. తనను కలిసేందుకు వచ్చేవారిని కూడా వీడియో తీసేందుకు ప్రత్యేకంగా వీడియో టీమును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంటే తన రాక సందర్భంగా అధికార పార్టీ నేతలు కానీ లేదా ప్రభుత్వం కానీ ఏమన్నా చేస్తుందేమో అనే అనుమానం ఆయ‌న‌లో కనబడుతోంది. ముఖ్యంగా గ‌తంలోనూ.. త‌న ప‌ర్య‌ట‌న‌ను వివాదం చేసేందుకు ఇక్క‌డి వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నించ‌డం.. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్‌ను మ‌రింత‌గా క‌ల‌వ‌ర పెడుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. దాదాపు రెండేళ్లుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరం కావ‌డం ఒక‌టైతే.. రెండోది ఫిబ్ర‌వ‌రి ఐదు త‌ర్వాత‌.. ఆయ‌న ఎప్పుడైనా రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అమ‌రావ‌తి అజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నారు. దీంతో ప్ర‌జ‌ల మూడ్‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించాల్సి ఉంది. అదేస‌మ‌యంలో త‌న‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వైసీపీ సృష్టించిన దూరాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయిన‌ప్ప‌టికీ.. ముప్పు ఉంద‌నే అనుమానంతో ఆయ‌న ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డుతుండ‌డంగ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News