కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే...సీఎం ఆయ‌నే!

Update: 2017-05-04 11:21 GMT
ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏంటి? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఎవ‌రైనా చెప్తారు! రాష్ట్ర విభ‌జ‌న గాయంతో ఆంధ్రులంతా కాంగ్రెస్ పార్టీపై ఎంతో గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ కు భ‌విష్య‌త్ లేద‌ని తేలిపోవ‌డంతో పార్టీ నేత‌ల్లో మెజార్టీ ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్  కేవ‌లం త‌న ఉనికి కోసం శ‌త‌విధాల ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే భావ‌న అన్ని వ‌ర్గాల్లో ఉంది. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా క్షేత్రంలో  దూసుకుపోతోంది. ఇక జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంద‌ర్భానుసారం త‌న ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. స్థూలంగా కాంగ్రెస్ ఒక పార్టీగా ఉందే త‌ప్ప బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా లేద‌నేది కాద‌నలేని నిజం. అలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రఘువీరారెడ్డి పేరును పరిశీలించాలని పలువురు ఏపీ కాంగ్రెస్‌ నాయకులు ప్రతిపాదించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయనే సమర్ధవంతమైన నాయకుడని వారు సూచించారు!

పార్టీ బ‌లోపేతం కోసం విజయవాడలో పీసీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ వర్క్‌ షాపునకు అధ్య‌క్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడితో పాటు సీఎం అభ్యర్థి కూడా చంద్రబాబునాయుడేనని, అదే సంస్కృతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కూడా ఉందన్నారు. అందువల్ల కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థిగా రఘువీరారెడ్డి పేరును ప్రకటిస్తే రాష్ట్రంలో పార్టీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉంటుందన్నారు. ఓట్ల శాతం కూడా పెరిగే అవకాశముంటుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ ఓటు బ్యాంకు గతంలో కాంగ్రెస్‌ కు అధికంగా ఉండేదని, వైఎస్ జగ‌న్‌ మోహన్‌ రెడ్డి పార్టీ పెట్టాక కొంతమేర కాంగ్రెస్‌ పార్టీకి నష్టం వాటిల్లిన విషయం నిజమేనన్నారు. ఆ నష్టాన్ని పూడ్చాలంటే రఘువీరారెడ్డి లాంటి సమర్థుడిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని ఆయన కోరారు. అయితే దీనిపై ఎలాంటి తీర్మానం జ‌ర‌గ‌లేదు.

కాగా, ఈ సంద‌ర్భంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ  2019 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండానే ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పార్టీ పునర్నిర్మాణంపై నాయకులు దృష్టి పెట్టాలని  సూచించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా పలు కార్యక్రమాల్ని చేపట్టాలన్నారు. టీడీపీ పాలనకు మూడేళ్లవుతున్న సందర్భంగా జూన్‌ 7న పీసీసీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దీనిపై జిల్లాల అధ్యక్షులు, నగర కమిటీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు ప్రజలను అప్రమత్తం చేయాలని ర‌ఘువీరారెడ్డి సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News