ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు, ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వంటివి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం టీడీపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వ్యవహారంగా మారింది. కొన్ని సందర్భాల్లో మిగతా పార్టీల అభిప్రాయాలకు అంతగా ప్రాధాన్యం దక్కడంలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో ఉన్న రఘువీరా రెడ్డి తన పార్టీని లైవ్ లో ఉంచేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు, ఫోన్‌ట్యాపింగ్ కేసు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల ముఖ్యమంత్రుల వ్యవహారశైలిపై గవర్నర్ నరసింహన్ కు లేఖరాశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇద్దరూ దోషులే అని రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయా కేసుల్లో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. కేంద్రమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సెక్షన్8 అమలును సైతం ఇద్దరు సీఎంలు స్వార్థానికి వాడుకుంటున్నారని, అందుకే గవర్నర్ బాధ్యత తీసుకోవాలని రఘువీరా కోరారు.
కేంద్రం పెద్దలు స్పందించకపోతే చెడు సంకేతాలు వెళ్తాయని, ఇరు రాష్ర్టాల మద్య చిచ్చు పుడుతుందని రఘువీరా వ్యాఖ్యానించారు. మొత్తానికి రఘువీరా తన పార్టీ ఉనికిని చాటేందుకు, సమస్యలపై స్పందించే క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులనే కాదు...కేంద్ర పెద్దలను సైతం ముగ్గులోకి లాగారానే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.