అవిశ్వాసం క్రెడిట్ కోసం కాంగ్రెస్ తహతహ!

Update: 2018-02-20 04:32 GMT
ఇప్పుడు అందరిదీ ఒకటే పాట అయిపోయింది.. అవిశ్వాసం. తాజాగా ఈ  రేసులోకి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి చేరింది. పవన్-ఉండవిల్లి అవిశ్వాసం మాటెత్తన తర్వాత.. జగన్ దాన్ని అందుకున్నారు. కంగారు పడ్డ  చంద్రబాబు ఆఖరి అస్త్రంగా అయితే తాను కూడా ప్రయోగిస్తా అని అన్నారు. ఈలోగా మేం రాహుల్ ను ఒప్పించాం.. మా యూపీఏ తరఫునే అవిశ్వాసం పెట్టేస్తాం అని రఘువీరా అంటున్నారు.

కానీ ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది ఏమిటంటే.. ఏపీ కాంగ్రెస్ నేతల మాటలకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద విలువ లేదు. ఆ హవా - ఏపీ నాయకుల చరిష్మా అన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాతోనే అంతరించిపోయాయి. కాబట్టి... మా రాహుల్ గాంధీ ని ఒప్పించేశా అని రఘువీరారెడ్డి చెప్పినంత మాత్రాన నమ్మడం కష్టం. కనీసం రఘువీరా చెప్పిన మాట.. అదే ‘ఏపీ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో అవిశ్వాసం ప్రతిపాదిస్తుంది’ అని రాహుల్ కనీసం ట్వీట్ చేస్తే తప్ప ఇలాంటి బూటకపు ప్రకటనలను ఏమాత్రం నమ్మలేం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అందరూ అవశ్వాసం మాటెత్తుతుండేసరికి - రఘువీరా కూడా అనేసినట్లుగానే ఇది కనిపిస్తోంది.

ఇలాంటి మాయ ప్రకటనలో కూడా రఘువీరా ఒక మడత పేచీ పెడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 184వ సెక్షను కింద లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మీద చర్చ జరగడానికి స్పీకరుకు ఒక నోటీసు ఇచ్చి ఉన్నదట. ఆ సెక్షను ప్రకారం.. ఆ అంశం మీద చర్చ జరిగితే.. దాని ఫాలోఅప్ గా ఓటింగ్ కూడా జరుగుతుందిట. ఒకవేళ స్పీకరు గనుక.. ఆ నోటీసు మీద చర్చకు అనుమతి ఇవ్వకపోతే.. అవశ్వాసం పెట్టడానికి మేం రెడీ అని రఘువీరా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

అంటే స్పీకరు ఆ బిల్లును చర్చకు అనుమతించేస్తే గనుక.. ఇక కాంగ్రెస్ తరఫునుంచి అవిశ్వాసం ఊసు ఉండదన్నమాట. కాకపోతే రఘువీరా చెబుతున్న మాటలు - ఇస్తున్న హింట్ లు.. అవిశ్వాసం పెట్టడం కోసం కాదు గానీ, అలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి తాము నోటీసు ఇచ్చిన చర్చకు అనుమతి ఇచ్చేయమని స్పీకరుకు హింట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. స్పీకరు ఆ చర్చను అనుమతిస్తే.. ఇక కాంగ్రెస్ అవిశ్వాసం జోలికి రాదన్నమాట. ఇంతోటి దానికి అంతలావు ప్రకటనలు ఎందుకూ అని జనం కాంగ్రెస్ వైఖరిపై పెదవి విరుస్తున్నారు.
Tags:    

Similar News